Arattai App | ఇప్పుడు మెసేజ్‌లు చేయాలన్నా.. ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా అందరూ వాడుతున్న యాప్ వాట్సాప్. మెట్రో సిటీల్లోని కార్పొరేట్ బిజినెస్‌ల నుంచి పల్లెటూళ్లలో పొలం పనులు చేసుకునే రైతన్నల దాకా వాట్సాప్‌నే వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ వాట్సాప్‌నకు పోటీగా ఒక యాప్ విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంటుంది. అదే ‘అరట్టై యాప్’. కొద్దిరోజులుగా దీనికి యూత్‌లో విపరీతమైన క్రేజ్ వస్తోంది. అది ఎలా ఉందంటే.. రోజుకు 3వేల సైన్అప్స్ నుంచి ఒక్కసారిగా 3.5 లక్షలకు చేరింది. అంటే ఈ మెసేజింగ్ యాప్ ఇప్పుడు వంద రెట్ల వృద్ధి సాధించింది. అందుకే దీన్ని చాలామంది వాట్సాప్ కిల్లర్‌గా పిలుస్తున్నారు. మరీ యాప్‌నకు ఒక్కసారిగా ఎందుకింత క్రేజ్ వచ్చింది? ఈ యాప్ స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
తిమిళంలో అరట్టై అంటే మాట్లాడుకోవడం అని అర్థం. వ్యక్తిగత మెసేజ్‌లతో పాటు గ్రూప్‌చాట్, ఆడియో, వీడియో కాల్స్ షేర్ చేసుకోవడం కోసం ఈ యాప్‌ను తీసుకొచ్చారు. జోహో కార్పొరేషన్ ఈ యాప్‌ను రూపొందించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించుకుని ఈ యాప్‌ను తయారుచేశారు.
నిజానికి ఈ యాప్ 2021లోనే విడుదలైంది. కానీ రీసెంట్గా ఈ యాప్‌నకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీనికి స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునివ్వడం ఒక కారణంగా చెప్పొచ్చు. స్వదేశీ డిజిటల్ సొల్యూషన్స్‌ను వాడాలని ఆయన పిలుపునిచ్చిన తర్వాత క్రేజ్ వచ్చిన యాప్‌ల్లో అరట్టైనే నంబర్‌వన్ పొజిషన్లోకి వచ్చింది. ఈ యాప్ సోషల్‌మీడియాలోనూ తెగ వైరల్‌గా మారింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ యాప్‌లో సైన్అప్ అయ్యే యూజర్ల సంఖ్యలో 100 శాతం వృద్ధి వచ్చింది. అంతకుముందు రోజుకు 3వేల సైన్అప్లు ఉండగా.. ఆ తర్వాత 3.5లక్షలకు చేరింది. ఈ విషయాన్ని అరట్టై యాప్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు స్వయంగా తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో వెల్లడించారు. ఈ గ్రోత్ మరో 100 రెట్లు పెరిగినా సరే సరిపోయేలా సర్వర్లను ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు.
వాట్సాప్ యాప్‌తో పోలిస్తే అరట్టైలో కొత్త ఫీచర్లు ఏమీ లేవు. కాకపోతే యూజర్లకు కావాల్సిన ప్రధాన ఫీచర్లు అయినా టెక్ట్స్, మీడియా ఫైల్ షేరింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కలదు. స్టోరీస్ కూడా పోస్టు చేసుకోవచ్చు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో దీన్ని లాగిన్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ యాప్స్, ఆండ్రాయిడ్ టీవీ ఇంటిగ్రేషన్ కలదు. ఇక యాప్ క్రియేటర్స్‌కు, బిజినెస్ కంపెనీలకు మంచి ఉపయోగకరమనే చెప్పొచ్చు. తమ ఛానళ్ల ద్వారా అప్డేట్స్ షేర్ చేసుకునే అవకాశం ఈ యాప్‌లో కల్పించారు. ఈ యాప్‌కు మొగ్గు చూపడానికి మరో కారణం ప్రైవసీ. ఇందులో యూజర్ డేటాను మానిటైజ్ చేయబోమని జోహో కంపెనీ చెప్పడం యూజర్లను తెగ ఆకట్టుకుంటుంది.
అరట్టై యాప్‌నకు వస్తున్న క్రేజ్ చూసి చాలామంది దీన్ని వాట్సాప్ కిల్లర్‌గా పిలుస్తున్నారు. కానీ 500 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్న వాట్సాప్‌నకు అరట్టై ఛాలెంజ్ ఇవ్వడం అంత సులువైన విషయం కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. రీసెంట్గా ఈ యాప్‌నకు పెరుగుతున్న యూజర్లతో సర్వర్లు మెయింటైన్ చేయడమే ఈ జోహో కంపెనీకి కష్టంగా మారింది. దీనివల్ల ఓటీపీలు ఆలస్యంగా రావడం, కాంటాక్ట్‌లు సింకింగ్ కాకపోవడం, కాల్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీన్ని జోహో కూడా అంగీకరించింది. ఆ సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది. ఇక అరట్టై యాప్‌ను కొత్త ఫీచర్లతో నవంబర్‌లో మళ్లీ రిలీజ్ చేయాలని అనుకుంది. కానీ ఇప్పుడొచ్చిన బూమ్‌తో సర్వర్లను బలోపేతం చేయడంపైనే కంపెనీ దృష్టిసారించింది. ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కరించి, ఎప్పటికప్పుడు అప్డేట్లు, కొత్త ఫీచర్లు చేర్చుకుంటూ వెళ్తే కచ్చితంగా వాట్సాప్‌నకు ప్రత్యామ్నయంగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.