పుట్టినప్పుడు మనిషి… మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో… అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి మొదలవుతుంది. ఆస్తి, అధికారం లాంటి మార్గాలతో తన ‘అహం’ తృప్తి చెందుతుంది. దాంతోపాటే మరో వాంఛ కూడా నిశ్శబ్దంగా రగులుతూ ఉంటుంది. అది… తన ఉనికి శాశ్వతం కావాలనే కోరిక. బహుశా అందుకేనేమో, మన పురాణాల్లో అమరత్వం ఓ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. క్షీరసాగరమధనం లాంటి ఘట్టాలు కావచ్చు, నిత్య యవ్వనాన్ని ఆశించే యయాతి లాంటి పాత్రలు కావచ్చు, మరణం తన జోలికి రాకూడదని కోరుకునే రాక్షసుల వరాలు కావచ్చు… ఏ కల్పమైనా, కల్పనైనా అమరత్వమనే కోరిక కచ్చితంగా కనిపిస్తుంది. నిన్నమొన్నటి వరకూ ఈ ప్రయత్నం మానవమాత్రులకు అసాధ్యం అనుకునేవారు. కానీ కొన్ని పరిశోధనలు, సంఘటనలు… మనిషి చిరంజీవిగా మారగలడనే ఆశను రేకెత్తిస్తున్నాయి. ఇది గాలివాటు మాట కాదు. విధినెదిరించే పోరాటం!
2005లో రే కర్జ్‌వైల్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్త ‘ద సింగ్యులారిటీ ఈజ్ నియర్’ అనే పుస్తకం రాశాడు. ఇలాంటి పుస్తకాలు రాయడం తనకు కొత్తేమీ కాదు. ది ఏజ్ ఆఫ్ ఇంటెలిజెంట్ మెషిన్స్, ది ఏజ్ ఆఫ్ స్పిరిచ్యువల్ మెషిన్స్ లాంటి పుస్తకాలెన్నో ఇదివరకు రాశాడు కర్జ్‌వైల్. రాబోయే రోజుల్లో సాంకేతికత ఎలా అభివృద్ధి చెందుతుందో తన రచనల ద్వారా కచ్చితంగా అంచనా వేయగలగడం ఆయన ప్రత్యేకత. చదరంగంలో రోబోలు మనిషిని ఓడిస్తాయనీ, ఓ సాధారణ ల్యాప్‌టాప్ మనిషి మెదడుకున్న సామర్థ్యంతో పనిచేయగలదనీ, 2010కల్లా లోకంలో చాలామందికి వైఫై అందుబాటులోకి వచ్చేస్తుందనీ… ఇలా చాలా విషయాలు ఎన్నో ఏళ్ల ముందే ఆయన అంచనా వేశారు.
అలాగే ‘ద సింగ్యులారిటీ ఈజ్ నియర్’ పుస్తకంలోనూ ఓ అనూహ్యమైన ప్రతిపాదన చేశారు. 2029 కల్లా రోబోలు మనుషుల స్థాయికి చేరుకుంటాయని, 2045 కల్లా మనుషులు, రోబోల మధ్య ఏకత్వం (Singularity) వచ్చేస్తుందనీ ఊహించారు. కర్జ్‌వైల్ మీద గౌరవం ఉన్నప్పటికీ, 2005లో ఈ ప్రతిపాదనలు మరీ చిత్రంగా తోచాయి. కానీ ఎప్పుడైతే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో చాట్ జీపీటీ లాంటి ఆవిష్కరణలు మొదలయ్యాయో… ఒక్కసారిగా కర్జ్‌వైల్ మాటల్లో నిజం ఉందేమో అన్న అనుమానం, విశ్లేషణ మొదలైంది. తను 20 ఏళ్ల క్రితం చెప్పిన అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపించడంతో… కర్జ్‌వైల్ ఈ ఏడాది ‘ద సింగ్యులారిటీ ఈజ్ నియరర్’ అనే పుస్తకం రాసేశారు. దాంతో ఇక ఇలాంటి పద్ధతుల ద్వారా మనిషి అమరత్వం సాధించవచ్చనే ఆశ పెరుగుతున్నది.
డిజిటల్ ఉనికి!
కొన్నేళ్ల క్రితం ఓపెన్ వార్మ్ (Open Worm) అనే ప్రాజెక్ట్ నడిచింది. సి.ఎలెగాన్స్ అనే ఓ చిన్న పురుగు నాడులను పోలిన సాఫ్ట్వేర్ రూపొందించి ఓ రోబో తయారుచేశారు. ఆశ్చర్యకరంగా… ఆ రోబో, సదరు పురుగులాగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఈ పురుగులో ఉన్నది కేవలం 302 న్యూరాన్లే! మనిషి మెదడులోనేమో ఏకంగా 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. అన్ని న్యూరాన్లను పోలిన సాఫ్ట్వేర్ రూపొందించడం అసంభవం అనుకునేవారు కానీ, ఇప్పటి సాంకేతిక అభివృద్ధి చూస్తుంటే అది సాధ్యం అనిపించక మానదు.
ఇలా మనిషి మెదడును పోలిన రోబో లేదా సాఫ్ట్‌వేర్‌ని రూపొందించాక… ఓ వ్యక్తి మెదడులో ఉన్న సమాచారాన్నంతా అందులోకి బదలాయించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు డిజిటల్ కాపీ, డిజిటల్ ట్విన్ లాంటి రకరకాల పేర్లున్నాయి. ఇదే కనుక సాధ్యమైతే మనిషి శరీరం అంతరించిపోయినా… తన ఉనికి, జ్ఞాపకాలు, అనుభవం అన్నీ సజీవంగానే ఉంటాయన్నమాట. వినేందుకు ఇది చాలా క్లిష్టంగా తోస్తున్నప్పటికీ, ఆ దిశగా చాలా ప్రయోగాలే జరుగుతున్నాయి.
నిజానికి మనుషులూ, యంత్రాలూ కొన్నాళ్లకు కలిసిపోయే అవకాశం ఉందనే ఆలోచన మీద పేటెంట్ కర్జ్వైల్ది కానేకాదు. 1960లోనే ‘మానవ యంత్రాలు’ (సైబార్గ్) అనే మాట ప్రచారంలోకి వచ్చేసింది. ‘మనుషులు సాంకేతికత మీద ఎంతలా ఆధారపడుతున్నారంటే… కొన్నాళ్లకు ఆ రెండిటి మధ్యా విభజన చెరిగిపోతుంది’ అని డోనా హారవే అనే శాస్త్రవేత్త అప్పట్లోనే కుండబద్దలు కొట్టేశారు.
కొన్ని చిరుజీవులు చిరంజీవులు!
మన పురాణాల్లో రక్తబీజుడనే రాక్షసుడి పాత్ర గుర్తుండే ఉంటుంది. నేల మీద తన రక్తపు చుక్కపడినా, దానినుంచి మరో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. గ్రీకు పురాణాల్లోనూ తల వేరైతే మరో తలతో బతికే హైడ్రా అనే పాత్ర ఉంది. దాని పేరునే ఓ నీటి జీవికి పెట్టారు. కారణం! అది ఆకలితోనో, మరో జీవికి ఆహారంగానో, వ్యాధితోనో చనిపోవాలే కానీ… వార్ధక్యంతో చనిపోయే అవకాశం లేదు. ఎందుకంటే, దాని శరీరంలో మూలకణాలే ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు సరికొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ మనిషి శరీరంలో మూల కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది.
అందుకే కాలేయం, చర్మం లాంటివి తప్ప ఇతర అవయవాలు దెబ్బతింటే… ఆ ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. ఉదాహరణకు మన కాలేయంలో కొంతభాగాన్ని తొలగిస్తే, అది తిరిగి పెరుగుతుంది. కానీ చేయి లేదా కన్నుని తొలగిస్తే… ఆ లోటు అలాగే ఉంటుంది. హైడ్రా జీవి నిత్య యవ్వనంగా ఉంటుంది కాబట్టే, దాని సంతానోత్పత్తి సామర్థ్యం కూడా చెక్కు చెదరదు. గ్లాస్ స్పాంజెస్ అని పిల్చుకునే జీవులు 15 వేల ఏళ్లు బతుకుతాయి, రాక్ ఫిష్ లాంటి చేపలు రెండు వందల ఏళ్లకు పైనే జీవిస్తాయి.
వీటన్నిటినీ పరిశీలిస్తే… అమరత్వపు రహస్యం తెలుస్తుంది. కానీ అది మనుషులకు ఆపాదించగలమా అన్నది ప్రశ్న. ఉదాహరణకు హైడ్రాలాగే మనలో కూడా మూలకణాల ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త అవయవాలు సృష్టిస్తూ, యవ్వనాన్ని నిలిపే ప్రయత్నం చేశామే అనుకుందాం. అప్పుడు మన మెదడు, అందులో ఉన్న జ్ఞాపకాలు చెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని… అమరత్వం వైపు అడుగులు పడనున్నాయి.
ఇప్పుడంతా సూక్ష్మ పరికరాల రాజ్యం నడుస్తున్నది. ఇది అమరత్వానికి కూడా సాయపడుతుందనే ఆశ ఉంది. ఒక అంగుళంలో వందల కోట్ల వంతు ఉండే ఈ నానో టెక్నాలజీతో రూపొందించిన చిన్నచిన్న రోబోలు మన రక్తప్రవాహంలోకి చేరి దెబ్బతిన్న కణాలను బాగుచేస్తూ, సూక్ష్మజీవులను అంతం చేస్తూ, క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేస్తూ… ముసలితనం దరిచేరకుండా చూస్తాయనే ఆశ ఉంది. ఆ దిశగా ప్రయోగాలూ జరుగుతున్నాయి. ఈ నానో రోబోలను శరీరంలోకి పంపాలనే ఊహ 65 ఏళ్ల క్రితమే వ్యక్తమైంది. ఇంతకుముందు చెప్పుకొన్న కర్జ్‌వైల్ కూడా తన పుస్తకంలో 2030 నాటికి నానో రోబోలు, అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నాడు. తను ఊహించినట్టుగా ఇప్పటికే, మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో నానో టెక్నాలజీ ద్వారా శరీరం మూలమూలకీ మందులను అందించే ప్రయోగం విజయవంతమైంది.
Yoga
యోగాతోనూ అవకాశం!
శ్వాస ఉన్నంతవరకూ ప్రాణశక్తి ఉంటుంది. ఆ శ్వాసను నియంత్రించుకుంటూ, ప్రాణశక్తిని కాపాడుకుంటూ ఉంటే ఎన్నాళ్లయినా… వ్యాధి, వార్ధక్యం, మృత్యువు మన దరిచేరవు. అమృతత్వానికి సంబంధించి, యోగా నుంచి తెలుసుకోగలిగే విషయమిది. శ్వాస మీద అదుపుతో గుండె వేగాన్ని సైతం అదుపుచేయడం యోగాతో సాధ్యమని పరిశోధనలు నిరూపించాయి. ‘ఒక యోగి ఆత్మకథ’ లాంటి పుస్తకాలు యోగ ప్రభావం మీద మరింత నమ్మకాన్ని కలిగించాయి. తమిళనాట పూజలందుకునే 63 మంది నయనార్లలో తిరుమూలర్ ఒకరు. సుమారు క్రీస్తుశకం నాలుగో శతాబ్దంలో ఆయన తిరుమంతిరం (తిరుమంత్రం) అనే గ్రంథం రాశారు.
ఇందులో యోగశాస్త్రం అభ్యసించడం మీద విస్తృతమైన సూచనలు కనిపిస్తాయి. హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన అగివిచ్ అనే పరిశోధకుడు ఈ తిరుమంతిరంలో సూచించిన అష్టాంగయోగ, చంద్రయోగ లాంటివి పాటించడం ద్వారా ప్రాణశక్తిని, ధాతువును నిలిపి ఉంచుకుని… అమరత్వాన్ని సాధించవచ్చంటూ ఏకంగా ఒక పరిశోధన పత్రాన్నే రాశారు. యోగాను మూఢత్వం అంటూ శాస్త్రవేత్తలు, విజ్ఞానానిది అహంకారం అంటూ సంప్రదాయవాదులూ తిరస్కరించకుండా… నమ్మకాలకు అతీతంగా యోగా వల్ల శాస్త్రీయమైన లాభాలను పరీక్షించే ప్రయత్నం చేసినప్పుడే దానివల్ల ఆరోగ్యానికీ, ఆయుష్షుకీ ఎంతవరకు లాభం ఉంటుందో తెలుసుకోగలుగుతారు.
జన్యుమార్పులతో…
దాదాపు 50 ఏళ్ల క్రితమే జాన్ కైర్న్స్ అనే శాస్త్రవేత్త ‘ఇమ్మోర్టల్ డీఎన్ఏ స్ట్రాండ్’ అనే సిద్ధాంతాన్ని కనుగొన్నారు. జన్యువులలో ఇదొక కీలకభాగం. దీని మీద దృష్టి సారిస్తే… రోగాల్ని ఎదుర్కోవడం, వార్ధక్యాన్ని అడ్డుకోవడం సాధ్యమవుతుందని అంచనా. అలాగే క్రోమోజోమ్స్ చివర ఉండే టెలొమీర్ అరిగిపోతున్న కొద్దీ, కణవిభజనలో డీఎన్ఏ పల్చబడిపోతుంటుంది. వార్ధక్యానికి ఇదే కీలకమైన కారణం. ఈ టెలొమీర్ని కనుక రక్షించగలిగితే, సమస్య చాలావరకు తీరిపోయినట్టే. ఎలుకలలో ఈ దిశగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు, వాటి వయసును గణనీయంగా పెంచగలిగారు కూడా!
పర్యవసానాలు!
అమరత్వం ఓ సహజమైన కోరికే కావచ్చు. కానీ తన మేధస్సుతో సృష్టిధర్మాన్నే తిరగరాయాలనుకునే ప్రయత్నం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో అనే భయం లేకపోలేదు. క్లోనింగ్ ప్రక్రియ మీద ఎన్ని వివాదాలు నడిచాయో చూశాం. డిజిటల్ రూపంలో అయినా శాశ్వతంగా ఉండాలనే ప్రయత్నం మానవ జాతికి పోటీగా సైబార్గులను నిలబెడుతుందనీ భయపడుతున్నారు. యువాన్ కార్లోస్ అనే స్పానిష్ శాస్త్రవేత్త మనిషి అండాన్ని, కోతి అండాన్ని కలిపి ఫలదీకరిస్తే ఆయువు 50 శాతం పెరుగుతుందని ప్రకటించాడు.
అలాంటి వ్యక్తికి అమరత్వం కోసం సాగే ప్రాజెక్టులలో ఉన్నత పదవిని ఇవ్వడం, ఆందోళనలకు దారితీస్తోంది. అంతేకాదు! మనిషి ఆయువు పెరిగిపోవడం వల్ల జనాభా లెక్క తప్పితే, వనరులు ఎలా? వారికి ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి? మరణాన్ని ఎదిరించినవాడు, సాటి మనుషుల మీద ఆధిపత్యాన్ని సాధించే రాక్షసుడిగా మారడా ??… లాంటి సవాలక్ష సవాళ్లకు తప్పనిసరిగా జవాబులు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అమరత్వం దిశగా ప్రయత్నించేవారు మర్చిపోయే మరో విషయం.. సమతుల్యం! ప్రకృతి ఎప్పుడూ జీవజాతుల సంఖ్యను ఓ కంట గమనిస్తూ ఉంటుంది. ఈ అదృశ్య నియంత్రణ వల్లే అప్పుడప్పుడూ అనూహ్యమైన ఇన్ఫెక్షన్లు చెలరేగుతాయనీ, సంతానోత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయనీ కొందరు వైజ్ఞానికులే నమ్ముతారు.
మరణం ఎందుకని?
చావు మన దృష్టిలో ఒక లోటు, బాధ కావచ్చు. కానీ ప్రకృతికి అది అనివార్యం. ఈ భూమ్మీద ఏర్పడిన తొలి జీవులు అంత సంక్లిష్టమైనవి కావు. ఆల్గేలాంటి ఏకకణ జీవులు, తమను తాము విభజించుకుంటూ పెరుగుతాయి. కానీ విభజన స్థానంలో ఎప్పుడైతే లైంగికంగా పునరుత్పత్తి చేసే జీవులు మొదలయ్యాయో, మరణమూ అనివార్యమైంది. ఓ సిద్ధాంతం ప్రకారం… మనుషులు తాము పుట్టి పెరిగి, మరో జీవికి జన్మనివ్వడంతో వారి బాధ్యత తీరుతుంది. కొత్త తరం మనుగడ సాగే అవకాశాన్నిస్తూ, పాత తరం నిష్క్రమిస్తుంది. ఆ మరణం మనకు అకస్మాత్తుగా తోచవచ్చు. కానీ పుట్టినప్పటి నుంచే కౌంట్‌డౌన్ మొదలవుతుంది. వార్ధక్యంతో సాధ్యమవుతుంది. వార్ధక్యం ఎలా, ఎందుకు కలుగుతుందనే దానిమీద కొన్ని వందల సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా కనిపించే కారణాలు.
1 నిరంతర విభజనతో కణాలు బలహీనపడతాయి. ఒకో విభజన తర్వాత వాటి పటుత్వం తగ్గుతూ వస్తుంది.
2 ఏ జీవి అయినా తన చుట్టూ ఉన్న వాతావరణంతో ప్రభావితం అవుతుంది. కాలుష్యం, ఆహారంలో పొరపాట్లు, ఇన్ఫెక్షన్లు వాటిని బలహీనపరుస్తాయి.
3 ప్రతి క్రోమోజోమ్ చివరా టెలొమీర్ అనే తోక ఉంటుంది. దాని అరుగుదలే, మరణానికి చేరువచేస్తుంది.
4 కాలంతోపాటు జరిగే రసాయన చర్యలతో..కణాలలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఇవి వయసును వేగవంతం చేస్తాయి.
5 రోజులు గడిచేకొద్దీ, కణవిభజన జరిగేకొద్దీ జన్యునిర్మాణంలోపొరపాట్లు, మార్పులు రావచ్చు. దీన్ని సరిదిద్దుకునే సామర్థ్యం మానవ శరీరంలో తక్కువ.
ఇవే కాదు జీన్ థియరీ, ఎండోక్రైన్ థియరీ అంటూ ఎన్నో సిద్ధాంతాలు… మనిషి క్రమంగా మరణం దిశగా ఎలా ప్రయాణిస్తున్నాడో చెబుతాయి.
మనిషి ఆయువు 120 సంవత్సరాలని పెద్దలు నమ్మేవారు. మానవ చరిత్రలో ఒకే ఒక్క వ్యక్తి ఆ పరిమితిని దాటాడు. ఫ్రాన్సుకి చెందిన జీన్ కాల్మెంట్ 122 ఏళ్లు బతకడం, ఓ అధికారిక రికార్డు. కాస్త జాగ్రత్తగా ఉంటే 150 ఏళ్లు బతకడం అసాధ్యం కాదని టిమోతీ అనే సింగపూర్ శాస్త్రవేత్త ప్రకటించాడు. అంతేకానీ వైజ్ఞానిక లోకం కూడా అమరత్వం సాధ్యమేనని కచ్చితంగా చెప్పలేకపోతున్నది. ఒకవేళ అది సాధ్యమైనా… కొవిడ్ లాంటి ఇన్ఫెక్షన్లు, ప్రకృతి విపత్తులు ఎప్పటికప్పుడు మనిషిని సవాలు చేస్తూనే ఉంటాయి. వాటినీ దాటినా… ఈ ప్రపంచగతినైతే మార్చలేం కదా! భగభగమండే సూర్యుడు చల్లబడిపోయినా, ఉల్కల వర్షం కురిసినా… పుడమి ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి అమరత్వం గురించి ఆశపడుతూనే చేతిలో ఉన్న జీవితాన్ని పరిపూర్ణంగా, సహజంగా, ఆరోగ్యవంతంగా కొనసాగించే ప్రయత్నం చేయాలి.
విజేతల కోరిక… అమరత్వం
అద్భుతమైన విజయాలు, అంతులేని వ్యాపార సామ్రాజ్యం- ఇవి మనిషికి తృప్తి కలిగించవు సరికదా, అవి మరింత అభివృద్ధి చెందాలనీ, తన సాధన శాశ్వతం కావాలనీ కోరుకుంటాడు. గూగుల్ సహ వ్యవస్థాపకుడైన లారీ పేజ్ 2013లో కాలికో (కాలిఫోర్నియా లైఫ్ కంపెనీ) అనే సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ఇది గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్లో భాగం. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు చాలా రోజులపాటు రహస్యంగా ఉండటంతో తీవ్రమైన విమర్శలు తలెత్తాయి. మనిషి ఆయువును వీలైనంత పెంచడం, అమరత్వాన్ని సాధించడమే దీని ముఖ్య లక్ష్యమని చెబుతారు.
ఇక ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈమధ్యనే ఆల్టోస్ ల్యాబ్ అనే పరిశోధనా కేంద్రానికి ఉదారంగా నిధులందించారు. మానవకణాలను పునరుజ్జీవింపచేసి, వాటిని వార్ధక్యానికి దూరంగా ఉంచడమే దీని ఉద్దేశం. కణాలను రీప్రోగ్రామింగ్ చేయవచ్చని నిరూపించి నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త షిన్యా యమనక, ఆల్టోస్కి సలహాదారుగా ఉండటం గమనించదగ్గ విషయం. బ్రయాన్ జాన్సన్ అనే మరో పారిశ్రామికవేత్త తన వయసును వెనక్కి మళ్లించేందుకు, ఏటా ఏకంగా 16 కోట్ల రూపాయల్ని ఖర్చుపెడుతున్నారు. బ్రయాన్ కోసం 30 మంది నిపుణులు నిరంతరం పనిచేస్తుంటారు.
తను రోజుకు 110 విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటాడు. వీటన్నిటి ఫలితం కాస్త ఆశాజనకంగానే ఉంది. 46 ఏళ్ల బ్రియాన్ ఇప్పుడు 20 ఏళ్లవాడిలా కనిపిస్తున్నాడు. లారీ పేజ్, జెఫ్ బెజోస్, బ్రయాన్ మాత్రమే కాదు… పీటర్ థేల్ (పే పాల్), లేరీ ఎలిసన్ (ఒరాకిల్) లాంటి కార్పొరేట్ విజేతలెందరో ఈ అమరత్వపు ప్రయత్నాల్లో ఉన్నారు. వీరికి భిన్నంగా ఎలన్ మస్క్ మాత్రం తనకు సుదీర్ఘకాలం జీవించే ఆశ లేదని తేల్చేశాడు.
సైరో
రాబోయే రోజుల్లో మనుషులు అమరత్వాన్ని సాధించే ఆశ లేశమాత్రంగా ఉంది. అదీ కుదరకున్నా… తన జీవితకాలాన్ని మరింత సుదీర్ఘంగా పొడిగించే అవకాశం లేకపోలేదు. ఇప్పుడిప్పుడే వార్ధక్యంలోకి అడుగుపెట్టేవారు, ఆ రోజులను చూడలేరేమో కదా! తమ జీవితం ఇక్కడితో ముగిసిపోవాల్సిందేనా? అన్న నిరాశకు జవాబే సైరోనిక్స్. ఈ సేవ కోసం కంపెనీలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.
ఈ ప్రక్రియలో భాగంగా ఓ మనిషి చనిపోయిన వెంటనే రక్తం పలచబరిచే మందులతో (బ్లడ్ థిన్నర్స్), ఎక్కడా అది గడ్డకట్టకుండా చూస్తారు. తర్వాత విట్రిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరం ఒక్కసారిగా చల్లబడేలా చేస్తారు. శరీరాన్ని నిదానంగా చల్లబరిస్తే, కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ విట్రిఫికేషన్లో ఆ ప్రమాదం ఉండదట. చివరి దశలో ఆ శరీరాలను నైట్రోజన్ చాంబర్లో ఉంచుతారు. సైరోనిక్స్ ఇన్స్టిట్యూట్, ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ లాంటి సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. ఆల్కార్ ఫౌండేషన్ అయితే… పూర్తి శరీరం భద్రపరుచుకునే స్తోమత లేనివారు, 80 వేల డాలర్లకు తమ మెదడును భద్రపరుచుకోవచ్చు అని ప్రకటించింది.
అబ్బే ఇదంతా అత్యాశ! ఇలాంటి సేవల కోసం కోట్లు వెదజల్లేదెవరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే సైరోనిక్స్ ఇన్స్టిట్యూట్లో ఇప్పటికే 250 పార్థివదేహాలు నైట్రోజన్ పీపాలలో ఉన్నాయి. రెండువేల మంది సభ్యులు, తమ మరణానంతరం అక్కడికి తీసుకువెళ్లమని అభ్యర్థిస్తున్నారు. అన్నట్టు ఈ సైరోనిక్స్ ఇన్స్టిట్యూట్ ఇప్పటిదే అనుకుంటే పొరపాటే. ఎప్పుడో 1976లోనే దీన్ని ప్రారంభించారు. నాటి దేహాలు కూడా కొన్ని, పునర్జీవితం కోసం ఎదురుచూస్తున్నాయి. విజ్ఞానంలో ఓ మేలి మలుపు తమను మేల్కొల్పకపోతుందా అన్నది, ఇందులో చేరేవారి ఆశ. ఇంకాచెప్పాలంటే ఈ తరహా ప్రయత్నం వేల ఏళ్ల నాడే కనిపిస్తుంది. ఈజిప్షియన్లు చనిపోయినవారిని మమ్మీలుగా మార్చడం వెనుక ఇలాంటి కోరికే కదా ఉన్నది!