WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్లకు అనునిత్యం మెరుగైన సేవలు అందించడానికి అడ్వాన్స్ ఫీచర్లు పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే డిజైన్ చేసిన ఆడియో చాట్స్ (Audio Chats), ఎడిట్ మెసేజ్ (Edit Message), వ్యూ వన్స్ ఆడియో (View Once Audio) తదితర ఫీచర్లు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నది.
ఇందులో భాగంగా తాజాగా మరో ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనున్నది. మూడేండ్ల క్రితం 2020లో పరిచయం చేసిన డిజప్పియరింగ్ మేసేజ్ ((Disappearing Message) ఫీచర్ అనునిత్య అప్డేట్ చేస్తున్నది. తాజాగా మరో అప్డేట్ తేనున్నది. ఈ డిజప్పియరింగ్ ఫీచర్లో ఇప్పుడు ఉన్న టైం ఆప్షన్లకు తోడు మరో 15 ఆప్షన్లు జత చేయనున్నది. అడిషనల్ ఆప్షన్లతో యూజర్లు జరిపే సంభాషణలు త్వరత్వరగా డిలిట్ కావడంతోపాటు ఇతరులు ఆ చాట్స్‌ను చూడలేరని వాట్సాప్ యాజమాన్యం భావిస్తున్నది.
ప్రస్తుతం వాట్సాప్ డిజప్పియరింగ్ ఫీచర్లో 24 గంటలు, వారం, 90 రోజుల టైం ఆప్షన్లున్నాయి. ఒక వాట్సాప్ యూజర్ డిజప్పియరింగ్ ఆప్షన్ ఆన్‌చేసి ఈ మూడు టైం లిమిట్స్‌లో తమకు ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వారం/ 90 రోజులు/ 24 గంటల ఆప్షన్లలో సదరు యూజర్ వాట్సాప్ యూజర్ ఎంపిక చేసుకున్న గడువు తర్వాత సంబంధిత చాట్ డిలిట్ అవుతుంది.
అందుబాటులో ఉన్న మూడు ఆప్షన్లతోపాటు కొత్తగా గంట నుంచి ఏడాది గడువు వరకు వేర్వేరు ఆప్షన్లు రానున్నాయి. మోర్ ఆప్షన్స్ అనే ఫీచర్ కొత్తగా పరిచయం చేస్తారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వాట్సాప్ పరీక్షిస్తున్నది. త్వరలోనే ఈ ఫీచర్‌ను సాధారణ యూజర్లకు అందుబాటులోకి తేనున్నది.