శివ్వంపేట, అక్టోబర్ 5 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని గంగాయిపల్లి నుంచి తండా మీదుగా చండి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం సర్పంచ్ రావెల్లి సాయిలుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.7 కోట్లతో మండలంలో ఏడు లింకు రోడ్లను బీటీ రోడ్లుగా మార్చుతున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలు, తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు గత ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసిందని, అందులో 26 రోడ్లకు సంబంధించిన రూ.48 కోట్ల నిధులు నిలిచిపోయాయని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిల్లులు నిలిచిపోయినప్పటికీ కాంట్రాక్టర్ కాంతారావు ముందుకొచ్చి రోడ్డు పనులు ప్రారంభించడం అభినందనీయమని ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పవన్‌కుమార్ గుప్తా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, సర్పంచులు ప్రవీణ్‌గౌడ్, నారాయణరావు, బానోత్ కవిత, బీఆర్ఎస్ నాయకులు మర్రి మహేందర్‌రెడ్డి, రాజశేఖర్‌గౌడ్, జగన్‌రెడ్డి, లాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.