Whatsapp For iPad | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉన్న విషయం విదితమే. ఈ యాప్‌ను ప్రస్తుతం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లను వాట్సాప్‌లో అందిస్తున్నారు. అనేక కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్‌లపై ఈ యాప్ అందుబాటులో ఉన్నా, వెబ్ వెర్షన్లో ఉపయోగించుకునేలా వీలు కల్పించినా కూడా యాపిల్ ఐప్యాడ్‌లో మాత్రం ఇప్పటి వరకు వాట్సాప్ లేదు. కానీ తాజాగా ఈ కొరతను కూడా మెటా తీర్చింది. ఐప్యాడ్‌లోనూ ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మెటా వెల్లడించింది.
చాలా రోజుల వెయిటింగ్ తరువాత ఎట్టకేలకు ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్‌కు గాను వాట్సాప్‌ను ప్రవేశపెట్టినట్లు మెటా తెలియజేసింది. ఈ మేరకు వాట్సాప్ తన అఫిషియల్ ఎక్స్ పోస్టులో ఈ వివరాలను ప్రకటించింది. యాప్ స్టోర్‌లో వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునే లింక్‌ను కూడా పోస్టు చేసింది. ఐప్యాడ్ లో వాట్సాప్‌ను ఉపయోగించుకోవాలనుకునేవారు ఈ యాప్‌ను ప్రస్తుతం యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ఐప్యాడ్‌లో ఐప్యాడ్ ఓఎస్ 15.1 లేదా ఆపైన ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఉండాలని వాట్సాప్ తెలియజేసింది.
మెటా ప్రవేశపెట్టిన ఈ యాప్‌కు గాను ఐప్యాడ్ యూజర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో తాము ఈ యాప్ కోసం ఎదురు చూస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. దీని వల్ల యూజర్లు ఇకపై వాట్సాప్‌ను ఐప్యాడ్‌లోనూ ఉపయోగించుకోవచ్చు. పెద్ద స్క్రీన్‌లో ఫొటోలు, వీడియోలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. స్టేటస్ అప్డేట్స్ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఐప్యాడ్ లో వాట్సాప్ వెర్షన్‌కు గాను ఐఫోన్లో ఉన్న వాట్సాప్ వెర్షన్ లాంటి ఫీచర్లనే అందిస్తున్నారు. దీంతో యూజర్లు ఏకకాలంలో 32 మందితో ఆడియో లేదా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకు గాను కాల్లో ఉన్నప్పుడు ఐప్యాడ్ కు చెందిన ఫ్రంట్ లేదా బ్యాక్ కెమెరాను ఉపయోగించుకోవచ్చు.
ఐప్యాడ్ ఓఎస్ వాట్సాప్‌లో స్టేజ్ మేనేజర్ ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. దీని సహాయంతో ట్యాబ్‌లను రీసైజ్ చేసుకోవచ్చు. ట్యాబ్‌లను రీఆర్డర్లో పెట్టుకోవచ్చు. మల్టిపుల్ యాప్స్‌ను ఒకే దగ్గర ఉండేలా గ్రూప్ చేసుకోవచ్చు. స్ల్పిట్ వ్యూ, స్లై ఓవర వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఇతర యాప్‌లతో కలిపి వాట్సాప్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఐప్యాడ్ వినియోగదారులు వాట్సాప్‌ను ప్రస్తుతం యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్లో ఉన్న వాట్సాప్ అకౌంట్‌తో లాగిన్ అయితే అందులో ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను ఐప్యాడ్‌లోకి వచ్చేలా సులభంగా సింక్ చేసుకోవచ్చు. దీంతో ఏకకాలంలో ఐఫోన్‌తోపాటు ఐప్యాడ్‌లోనూ వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ యాప్‌ను ప్రవేశ పెట్టడంపై ఐప్యాడ్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.