WhatsApp Adds New Feature: Women can now track their menstrual cycle on WhatsApp; here’s how
Whatsapp | మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనునిత్యం తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నది. అందువల్లే వాట్సాప్‌ను ఎక్కువ మంది వాడుతున్నారు. సమాచారం ట్రాన్స్ఫర్ మొదలు ఆన్లైన్ పేమెంట్, షాపింగ్ తదితర పలు రకాల సేవలు వాట్సాప్ అందిస్తున్నది. ఈ-కామర్స్ వెబ్సైట్ సంస్థలు, బ్యాంకింగ్, మెడికల్ రంగాల సస్థలు కూడా చాట్‌బాట్ ద్వారా వాట్సాప్‌లో యూజర్లకు సేవలు అందిస్తున్నాయి. ఇక సరికొత్తగా మహిళల సౌకర్యార్థం మరో ఫీచర్ తీసుకొస్తున్నది.
మహిళా యూజర్ల సౌకర్యార్థం చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి తెస్తున్నది. ప్రతి నెలా వచ్చే నెలసరిని తేలిగ్గా కనిపెట్టడానికి సిరోనా హైజెనీ అనే సంస్థతో కలిసి వాట్సాప్ ఈ సర్వీసు అందిస్తున్నది. భారత్‌లో తొలిసారి ఈ సేవలు అందిస్తున్నామని వివరించింది. ఈ చాట్బాట్లో నెలసరి ట్రాకింగ్, గర్భదారణ, గర్భదారణ నివారణ వంటి సేవలను అందిస్తున్నది. అయితే, మహిళలు తమ నెలసరి గురించి కొంత ప్రాథమిక సమాచారం రిజిస్టర్ చేయాలి. అలా ఇచ్చిన డేటా ఆధారంగా చాట్‌బోట్ ( Chatbot ) తన యూజర్లకు సరైన నెలసరి తేదీని తెలియజేస్తుంది.
ఈ సేవలు పొందడానికి యూజర్లు 919718866644 అనే మొబైల్ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపి.. తర్వాత చాట్‌బోట్ చూపే 3 ఆప్షన్లలో ఒకటి ఎంచుకుని, ప్రాథమిక వివరాలు రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత వారు తమకు అవసరమైన సేవలు అందుకోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్ ద్వారా మహిళల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు సిరోనా హైజేనీ తెలిపింది.