Website Building Cost | సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాక వెబ్సైట్ల స్వరూపమే మారిపోయింది. చాలా మంది వెబ్సైట్లను క్రియేట్ చేసి వాటితో డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. అయితే అది అనుకున్నంత సులభమేమీ కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. వెబ్సైట్లను క్రియేట్ చేసే ముందు అసలు వెబ్‌సైట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలనుకుంటున్నారు.. అనే విషయంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని అంటున్నారు. మీరు ఏదైనా బిజినెస్ గనక చేస్తుంటే అందుకు సంబంధించి వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి కస్టమర్లను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించవచ్చు. ఆన్లైన్లో మీ వెబ్సైట్ ద్వారా ఆర్డర్లు తీసుకుని వాటిని డెలివరీ చేయవచ్చు.
మీకు బిజినెస్ ఏదీ లేకపోయినా ఇతర కంపెనీలకు చెందిన వస్తువులను మీ వెబ్సైట్ ద్వారా విక్రయిస్తూ దాంతో కమిషన్ పొందవచ్చు. అంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మాదిరిగా అన్నమాట. వీటినే ఈ-కామర్స్ సైట్లు అంటారు. మీరు ఏదైనా రంగానికి చెందిన సేవలను అందిస్తుంటే వాటికి గాను ఆన్లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షించేందుకు వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయవచ్చు. లేదా మీరు జర్నలిస్టు అయి ఉండి ఎలాంటి కథనాన్ని అయినా సులభంగా, ఆకర్షణీయంగా రాయగలిగే సామర్థ్యం ఉంటే మీరు ఒక బ్లాగ్ లేదా న్యూస్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఇలా మీరు ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలనుకుంటే ముందుగా ఏ రంగానికి చెందినదో పూర్తిగా స్పష్టమైన అవగాహన ఉండాలి.
సాధారణంగా ఏదైనా వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసేందుకు మూడు అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి డొమెయిన్, రెండోది హోస్టింగ్. మరొకటి డిజైన్. డొమెయిన్ అంటే మీ వెబ్సైట్ పేరు. ఇది మీ బిజినెస్‌ను ప్రతిబింబించేది అయి ఉండవచ్చు. లేదా మీకు నచ్చిన పేరుతో డొమెయిన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఏడాది కాలానికి గాను ఒక డొమెయిన్‌ను కొనుగోలు చేస్తే మీరు కనీసం రూ.300 నుంచి రూ.700 వరకు చెల్లించాలి. కొన్ని సంస్థలు 3 ఏళ్ల కాలానికి గాను కేవలం రూ.1 కే డొమెయిన్‌ను అందిస్తున్నాయి. ఇలాంటి ఆఫర్లతో తక్కువ ధరకే డొమెయిన్‌ను కొనుగోలు చేయవచ్చు. తరువాత హోస్టింగ్. మీరు క్రియేట్ చేయాలకునే వెబ్‌సైట్‌ను బట్టి హోస్టింగ్ ప్యాకేజీ ఉంటుంది. సాధారణ బ్లాగ్ లేదా కంపెనీ వెబ్‌సైట్‌కు అయితే ఏడాదికి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు హోస్టింగ్ చార్జి అవుతుంది. 3 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఇంకా తక్కువకే హోస్టింగ్ ప్యాకేజీ వస్తుంది.
అదే ఈ-కామర్స్ లాంటి వెబ్సైట్ పెట్టాలంటే సర్వర్ కెపాసిటీ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. దీనికి చాలా ఎక్కువ మొత్తంలో చార్జి వసూలు చేస్తారు. సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మేర హోస్టింగ్ ప్యాకేజీ అవుతుంది. అయితే ఇది ఆరంభంలో మాత్రమే. మీ వెబ్‌సైట్‌కు విజిటర్ల సంఖ్య పెరిగిన కొద్దీ హోస్టింగ్ కెపాసిటీని కూడా పెంచాల్సి వస్తుంది. అది సాధారణ బ్లాగ్ అయినా, కంపెనీ వెబ్సైట్ అయినా, ఈ-కామర్స్ సైట్ అయినా సరే విజిటర్ల సంఖ్య పెరుగుతుందంటే కచ్చితంగా హోస్టింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కావల్సిన కెపాసిటీని బట్టి చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక చిన్నపాటి బ్లాగ్ లేదా న్యూస్ వెబ్సైట్లు, కంపెనీ వెబ్ సైట్లను క్రియేట్ చేయాల్సి వస్తే చాలా వరకు హోస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఉచితంగా వెబ్సైట్ బిల్డర్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి వెబ్‌సైట్‌ను సులభంగా ఎవరికి వారే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జి అవసరం లేదు.
అయితే భారీ ఎత్తున పెట్టుబడి నెట్టి బిజినెస్ వెబ్సైట్ లేదా ఈ-కామర్ప్ సైట్‌ను క్రియేట్ చేస్తే మాత్రం కచ్చితంగా వెబ్ డెవలపర్లతో సైట్‌ను డిజైన్ చేయించాలి. అప్పుడే మీ సైట్‌ను విజిట్ చేసే యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. ఈ క్రమంలో వెబ్‌సైట్‌ను డిజైన్ చేసేందుకు సైట్ సంక్లిష్టతను బట్టి కనీసం రూ.1 లక్ష నుంచి పైన ఎంత వరకు అయినా వెబ్ డెవలపర్లు చార్జి చేస్తారు. ఆ డబ్బును భరించే స్థోమత ఉందనుకుంటేనే భారీ వెబ్సైట్లను క్రియేట్ చేసి రన్ చేయాలి. ఇలా పలు దశల్లో వెబ్సైట్లను క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మొత్తంగా చెప్పాలంటే సాధారణ వెబ్సైట్లు, బ్లాగ్‌లకు అన్నీ కలిపి ఏడాదికి రూ.5వేల వరకు ఖర్చవుతుంది. ఒక మోస్తరు బిజినెస్ సైట్లకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ-కామర్స్ సైట్లకు ఏడాదికి రూ.5 లక్షలకు పైనే ఖర్చవుతుంది. (ఇది కనీసం మాత్రమే). ఇంకా భారీ ఎత్తున వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయాలంటే అందుకు రూ.10 లక్షలకు పైగానే ఖర్చవుతుంది. ఎవరైనా తమ అవసరం, స్థోమతను బట్టి వెబ్సైట్లను క్రియేట్ చేసుకోవచ్చు. కానీ వెబ్సైట్ వల్ల ఏం చేయాలనుకుంటున్నారో ముందుగానే ఒక స్పష్టత ఉండడం అవసరం. లేదంటే అనవసరంగా డబ్బులను పోగొట్టుకోవాల్సి వస్తుంది.