Vivo Y39 5G | ప్రస్తుతం నడుస్తున్నది ఏఐ యుగం. చాలా మంది ఏఐతో పనులు చక్కబెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ఏఐ ఫీచర్లను తమ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు తమ ఫోన్లలో ఈ ఫీచర్లను అందిస్తుండగా, ఇతర సంస్థలు సైతం ఈ ఫీచర్లను తమ ఫోన్లలో ఏర్పాటు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇక తాజా వివో కూడా ఓ నూతన ఏఐ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. వివో లేటెస్ట్గా వై39 5జి అనే ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీంట్లో ఏఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.
వివో నుంచి వై సిరీస్‌లో లేటెస్ట్గా వచ్చిన వై39 5జి అనే ఫోన్లో 6.68 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ లభిస్తుంది. 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. మరో 8 జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను కొన్నవారికి 2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ లభిస్తాయి. 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తారు. ఈ ఫోన్లో ఏఐ స్క్రీన్ ట్రాన్స్లేషన్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని సహాయంతో లైవ్ టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఏఐ ఆడియో అల్గారిథమ్ ఫీచర్ ఉంది. సర్కిల్ టు సెర్చ్, ఏఐ సూపర్ లింక్ అనే ఫీచర్లను సైతం ఈ ఫోన్లో అందిస్తున్నారు.
ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది, మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌ను మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో తయారు చేశారు. అందువల్ల చాలా దృఢంగా ఉంటుంది. దీనికి షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఎస్జీఎస్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. స్క్రీన్ మీద గీతలు పడకుండా ప్రత్యేకంగా ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వివో వై39 5జి స్మార్ట్ ఫోన్లో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది బ్లూ వోల్ట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. 44 వాట్ల ఫ్లాష్ చార్జ్ సదుపాయం ఉంది. ఈ ఫోన్ బ్యాటరీకి 5 ఏళ్ల గ్యారంటీ ఇస్తుండడం విశేషం.
8జీబీ ర్యామ్, 128 లేదా 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. యూఎస్బీ టైప్ సి ఆడియోను సపోర్ట్ చేస్తుంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు అన్ని రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ కింద ఈ ఫోన్‌పై రూ.1500 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.