న్యూఢిల్లీ : భారత్‌లో వివో త్వరలో వివో వీ27 సిరీస్‌ను లాంఛ్ చేయనుంది. వివో వీ25, వివో వీ25 ప్రొ విజయవంతం కావడంతో వీటికి కొనసాగింపుగా వివో వీ27, వీ27 ప్రొను వచ్చే నెలలో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. వివో వీ27 రూ. 35,000కు అందుబాటులో ఉండనుండగా వీ27 ప్రొ దాదాపు రూ. 40,000 నుంచి లభిస్తుందని భావిస్తున్నారు.
న్యూ స్మార్ట్ఫోన్లను భారత్‌లో మార్చ్‌లో కంపెనీ లాంఛ్ చేయనుందని చెబుతున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లు డిస్టంట్ కలర్- ఛేంజింగ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయని 91మొబైల్స్ రిపోర్ట్ తెలిపింది. ఇక వివో వీ27 మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్తో రానుండగా వివో వీ27 ప్రొ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది.
వివో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు అఫిషియల్ వివో చానెల్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌పై అందుబాటులో ఉంటాయి. వివో వీ-సిరీస్ సెల్ఫీ కెమెరాలపై దృష్టి సారించడంతో వీ27 సిరీస్‌లోనూ మెరుగైన కెమెరా ఫీచర్లు ఉంటాయని ఆశించవచ్చు. ఫ్రంట్, రియర్ కెమెరాలతో 4కే రిజల్యూషన్ వీడియోలను తీసే వెసులుబాటుతో వీ27 సిరీస్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.
వెనుక భాగంలో ఓఐఎస్ ఆదారిత ప్రైమరీ కెమరాను కొనసాగించవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ప్రొ మోడల్ కర్వ్డ్ డిస్ప్లేతో రాగా, లేటెస్ట్ ఫోన్లలో ఎలాంటి మార్పులు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది.