vivo T4 5G | ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. అందులో భాగంగానే వినియోగదారులు కూడా బడ్జెట్ ధరలోనే మరిన్ని ఫీచర్లు కలిగిన ఫోన్లను కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఎన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా రాకపోతే ఫోన్ కొని కూడా వృథాయే. అసలే చాలా మంది రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు ఫోన్లను ఒక రేంజ్లో ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటేనే ఎక్కువ సార్లు చార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం రాదు. కనుక బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఇచ్చే ఫోన్లను కొంటున్నారు. ఇక అలాంటి ఫోన్ల విషయానికి వస్తే వివో కంపెనీ లేటెస్ట్గా విడుదల చేసిన టి4 5జి ముందు వరుసలో నిలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అందిస్తున్నారు.
వివో లేటెస్ట్ఘా టి4 5జి పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను భారత్ లో లాంచ్ చేసింది. ఇందులో 6.77 ఇంచుల అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తోంది. అలాగే ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కూడా ఉంది. కనుక ఈ ఫోన్ డిస్ప్లేపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అందువల్ల సూర్యకాంతిలోనూ ఫోన్ తెరను చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇక ఈ ఫోన్లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా, ఇందులో 12 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఓఎస్ 15 తో వస్తుంది. ఈ ఫోన్‌కు గాను 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో ఏకంగా 7300 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఇదే ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్ ఏకంగా 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 7.5 వాట్ల వరకు రివర్స్ వైర్డ్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. మెమొరీ కార్డు వేసుకునేందుకు స్లాట్ లేదు. ఈ ఫోన్లో ఉన్న కెమెరాల సహాయంతో అద్భుతమైన క్వాలిటీ కలిగిన 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్‌తోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు.
యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఈ ఫోన్లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. అందువల్ల ఫోన్ చాలా మన్నికగా ఉంటుంది. ఐపీ 65 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. 5జిని ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. వివో టి4 స్మార్ట్ ఫోన్‌ను ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999గా ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.25,999గా ఉంది. ఫ్లిప్ కార్ట్‌తోపాటు వివో ఇండియా ఇ-స్టోర్‌లో, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 29 నుంచి విక్రయించనున్నారు. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను, రూ.2000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను, 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు.