TECNO Spark Go 3 | టెక్నో మొబైల్ తన తాజా బడ్జెట్ 4జి స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ గో 3 ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా రూపొందించిన ఈ ఫోన్‌ను ముఖ్యంగా విద్యార్థులు, యువ ఉద్యోగులు, ఫీల్డ్ వర్కర్లను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. దేశ్ జైసా దమ్దార్ అనే బ్రాండ్ పేరిట రూపొందిన ఈ ఫోన్, ఆకర్షణీయమైన డిజైన్ కంటే బలమైన నిర్మాణం, నమ్మకమైన పనితీరుపై ఎక్కువ దృష్టి పెట్టిందని టెక్నో పేర్కొంది. స్పార్క్ గో 3 స్మార్ట్ ఫోన్లో ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండడం విశేషం. అలాగే డ్రాప్ రెడీ డ్యూరబిలిటీని దీనికి అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ కింద పడ్డా అంత సులభంగా పగలదు. ఆ విధంగా డిజైన్‌ను ఇచ్చారు. నిర్మాణ ప్రాంతాలు, డెలివరీ రూట్లు, ట్రాన్స్పోర్ట్ జోన్లు వంటి కఠిన వాతావరణాల్లో ఉపయోగానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. రోజంతా ఉపయోగించుకుంటానికి వీలుగా ఈ ఫోన్ బ్యాటరీని తీర్చిదిద్దినట్లు కంపెనీ చెప్పింది. ఇందులో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద డిస్ప్లేను ఇచ్చారు. 6.74 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇందులో ఉంది. దీని వల్ల సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియో వీక్షణ, నావిగేషన్ మరింత స్మూత్‌గా ఉంటాయి. ఇక ఈ ఫోన్ లో పలు భారతీయ భాషల్లో AI అసిస్టెంట్ ను కూడా ఇస్తున్నారు. Spark Go 3లో టెక్నో అభివృద్ధి చేసిన Ella AI వాయిస్ అసిస్టెంట్ అందుబాటులో ఉంది. ఇది పలు భాషలను సపోర్ట్ చేస్తుంది. హిందీ, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో ఇందులో ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. దీంతో గ్రామీణ, ప్రాంతీయ వినియోగదారులకు మరింత సులభమైన డిజిటల్ అనుభూతి లభిస్తుంది.
ఈ ఫోన్లో ప్రత్యేకంగా నో నెట్ వర్క్ కమ్యూనికేషన్ 2.0 ఫీచర్ అందించారు. సిగ్నల్ లేని లేదా బలహీన నెట్వర్క్ ప్రాంతాల్లో కూడా పరిమిత కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అందువల్ల బేస్మెంట్లు, ఫ్యాక్టరీలు, గోదాములు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. టెక్నో స్పార్క్ గో 3 స్మార్ట్ ఫోన్ ను టైటానియం గ్రే, ఇంక్ బ్లాక్, గెలాక్సీ బ్లూ, అరోరా పర్పుల్ రంగుల్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ కు చెందిన 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999గా ఉంది. ఈ ఫోన్‌ను జనవరి 23వ తేదీ నుంచి అమెజాన్‌తోపాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు. ఈ సందర్భంగా టెక్నో మొబైల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ, భారత యువత రోజువారీ వేగానికి తగిన ఫోన్ కావాలి. Spark Go 3లో బలం, ఫీచర్లు, నమ్మకమైన కనెక్టివిటీని అందిస్తున్నాం. దేశ్ జైసా దమ్దార్ తత్వానికి అనుగుణంగా ఇది మొదటి రోజు నుంచే విశ్వాసాన్ని అందిస్తుంది.. అని తెలిపారు.