Tecno Pova 7 | బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి కస్టమర్లకు అందించడంలో అనేక కంపెనీలు ప్రస్తుతం పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే టెక్నో కంపెనీ లేటెస్ట్ గా అలాంటి ఓ రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. పోవా 7 5జి, పోవా 7 ప్రొ 5జి పేరిట టెక్నో కంపెనీ రెండు నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ల ధర తక్కువగా ఉండడమే కాదు, ఆకట్టుకునే ఫీచర్లను ఈ ఫోన్లలో అందిస్తున్నారు. ఈ ఫోన్లలో 6.78 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లేలు చాలా క్వాలిటీగా ఉంటాయని చెప్పవచ్చు. పోవా7 ఫోన్ కు చెందిన డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉండగా, ప్రొ మోడల్ డిస్ప్లే 1.5కె రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. మరో 8జీబీ వరకు ర్యామ్‌ను అదనంగా వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు.
ఈ ఫోన్లలో యూజర్లకు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ ఫోన్లకు గాను ఆండ్రాయిడ్ 16 ఓఎస్ అప్డేట్ను, 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లలో ఎల్లా ఏఐ పేరిట ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. ఏఐ కాల్ అసిస్టెంట్, ఏఐ ఆటో ఆన్సర్, ఏఐ వాయిస్ ప్రింట్ నాయిస్ సప్రెషన్ అనే ఏఐ ఫీచర్లను ఈ ఫోన్లలో అందిస్తున్నారు. ఈ ఫోన్లలో 5జి ప్లస్ ప్లస్ కనెక్టివిటీ లభిస్తుంది. పోవా 7 స్మార్ట్ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో సెకండరీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ప్రొ మోడల్ళో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటిలో ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్లలోని కెమెరాల సహాయంతో అద్భుతమైన 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
ఈ ఫోన్లకు గాను ఐపీ64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. వీటిల్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. అయితే ప్రొ మోడల్లో 30 వాట్ల వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను పొందవచ్చు. పోవా 7 స్మార్ట్ ఫోన్ళో 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ మోడల్స్ లభిస్తున్నాయి. మెమొరీని కార్డు ద్వారా పెంచుకునే సదుపాయం అందిస్తున్నారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉండగా, ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్‌ను కూడా ఇచ్చారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డాల్బీ అట్మోస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇక పోవా 7 ప్రొ స్మార్ట్ ఫోన్లోనూ ఇవే ఫీచర్లను అందిస్తున్నారు. కానీ డిస్ప్లేకు మాత్రం గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అలాగే మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ లేదు. మిగిలిన ఫీచర్లు యథాతథంగా అలానే ఉన్నాయి.
ఇక టెక్నో పోవా 7 5జి స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో ఫోన్‌ను రూ.2వేల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే టెక్నో పోవా 7 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌పై కూడా బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్లను జూలై 10వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఈ ఫోన్లపై అందిస్తున్నారు.