Tech Tips | ఫేస్బుక్లో ఏం పోస్ట్ చేస్తున్నారు, గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారు, కొరాలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, నెట్‌ఫ్లిక్స్‌లో ఏయే సినిమాలు చూస్తున్నారు?… అన్నీ రికార్డు అవుతున్నాయి. ఒక్కో ఇటుక పేర్చినట్టు.. ఒక్కో వివరాన్నీ గుదిగుచ్చి.. మీ చరిత్ర సిద్ధం చేస్తున్నారు. ఆ సమాచారాన్ని వ్యాపార వస్తువుగా వాడుకుంటున్నారు. బ్రౌజింగ్ విషయంలో జాగ్రత్తపడకపోతే.. ఆన్లైన్ మోసగాళ్ల వలలో పడిపోగలరు జాగ్రత్త!
సోషల్ ఇంజినీరింగ్ స్కామ్‌లో చిక్కుకోడానికి పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. సంక్లిష్టమైన పద్మవ్యూహంలో అడుగుపెట్టాల్సిన అవసరమూ లేదు.
‘హైదరాబాద్‌లో మంచి దమ్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది?’
‘పనికిరాని పాత సోఫా ఎక్కడ అమ్మాలి?’
‘లక్ష రూపాయలు పది లక్షలు కావడానికి ఎంత సమయం పడుతుంది?’
.. వగైరా వగైరా సింపుల్ విషయాలు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా సరిపోతుంది. అందులోనూ కొవిడ్ సంక్షోభం తర్వాత మనం ఇంటర్నెట్ వాడకానికి బాగా అలవాటు పడిపోయాం. బానిసలమైపోతున్నాం. మనకు తెలియకుండానే ప్రమాదకరమైన నెట్‌వర్క్‌లలోకి చొచ్చుకుపోతున్నాం. వైఫై షేర్ చేసుకుంటున్నాం. నాసిరకం అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. వర్చువల్ మీటింగ్స్ కూడా పెరిగిపోయాయి. దాంతోపాటే మన ప్రైవసీ మీద దాడులూ అధికం అవుతున్నాయి. క్రాష్ రిపోర్ట్స్, ఎనలిటిక్స్, ప్రొఫైలింగ్, ఐడెంటిఫికేషన్, యాడ్స్, లొకేషన్.. తదితర రూపాల్లో వ్యక్తిగతమైన డేటా చేతులు మారుతున్నది. ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నది. పడకూడని చేతుల్లో పడుతున్నది. ‘యూజర్స్ సౌకర్యార్థం’ అనే సాకు చూపించి.. వివిధ వెబ్‌సైట్స్ ఆ డేటాను పంచుకుంటున్నాయి, పండుగ చేసుకుంటున్నాయి.
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితమైన బ్రౌజింగ్ సాధ్యమే. దీనివల్ల కుకీస్లాంటి థర్డ్ పార్టీ టూల్స్‌ను నిరోధించవచ్చు. అన్నట్టు, ఈ కుకీస్ మహా ప్రమాదకరం. పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని సైతం తస్కరిస్తాయి. అందుకే ఇన్ ఆర్డర్, ఆర్ బ్రేవ్, డక్ డక్ గో, టోర్, మొజిల్లా, క్రోమ్ మొదలైన సేఫ్ బ్రౌజర్స్‌ను మనకు రక్షణ వలయంగా ఉపయోగించుకోవాలి. సురక్షితం కాని వెబ్‌సైట్స్, డౌన్లోడ్స్ గురించి కూడా ఇవి హెచ్చరిస్తాయి. అడిగిన వాటికంతా ఉదారంగా పర్మిషన్లు ఇవ్వకుండా.. ఆదిలోనే మంచి చెడులను వివరిస్తాయి. కుకీస్‌ను నిర్వీర్యం చేయడంలో సహకరిస్తాయి. ఏదైనా విషయాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు.. కొన్ని వెబ్సైట్లు మన అనుమతి లేకుండా ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి. ప్రమాదకరమైన సైట్స్ వైపు లాక్కెళ్తాయి. ఆ ప్రయత్నాన్ని ఈ బ్రౌజర్స్ బలంగా నిరోధిస్తాయి.
సేఫ్ బ్రౌజింగ్‌ను మరింత సమర్థవంతం చేయడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఆన్లైన్లో మనకు రక్షణ కవచంగా నిలిచేందుకు అనేక టూల్స్ అందు
బాటులో ఉన్నాయి.
వెబ్ బ్రౌజర్లు : చాలా వరకూ బ్రౌజర్లకు ఇన్‌బిల్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ జోడిస్తున్నారు. దీంతో హానికర వెబ్సైట్ల సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తున్నాయి.
సెక్యూరిటీ సాఫ్ట్వేర్: యాంటీవైరస్, యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్.. ఆన్లైన్ గండాల నుంచి రియల్-టైమ్ ప్రొటెక్షన్ అందిస్తాయి.
పాస్వర్డ్ మేనేజర్: పాస్‌వర్డ్‌ను సృష్టించడం ద్వారా.. దుర్భేద్యమైన లాగిన్ వ్యవస్థను ప్రసాదిస్తాయి.
వీపీఎన్‌లు: వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్.. మన ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తాయి. దీనివల్ల ఆన్లైన్ మోసగాళ్లు మన డేటాను దొంగిలించడం దాదాపుగా అసాధ్యం అవుతుంది.
ప్రైవసీ టూల్స్: బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్, యాడ్ ఆన్స్.. కుకీస్‌ను ట్రాక్ చేస్తూ, బ్లాక్ చేస్తూ.. మన ఆన్లైన్ ప్రైవసీని కాపాడుతాయి.
☞ అత్యంత ఆత్మీయులకైనా సరే.. కీలకమైన, పూర్తి వ్యక్తిగతమైన సమాచారాన్ని మెయిల్ ద్వారా పంపకపోవడమే మంచిది.
☞ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయడం సురక్షితం కాదు. ఆయా సంస్థల పోర్టల్‌లోని నంబరుకు మాత్రమే కాల్ చేయాలి.
☞ ఇమెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్‌కు రెండు దశల ధ్రువీకరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
☞ మీ బ్రౌజర్లను దేనికదే విడిగా ఉపయోగించడం ఉత్తమం. ఒక బ్రౌజర్‌ను కేవలం వెబ్ బ్రౌజింగ్‌కు, ఒక బ్రౌజర్‌ను.. బ్యాంకింగ్ వ్యవహారాలకు, మరొకటి సోషల్ మీడియాకు.. ఇలా అన్నమాట. కుకీస్‌ను మొదట్లోనే నిరోధించండి. బ్రౌజింగ్ హిస్టరీ నిల్వ ఉండకుండా చూసుకోండి.
☞ అది మీ సొంత సిస్టమ్ అయినా సరే, పనైపోగానే సోషల్ మీడియా, ఇమెయిల్ ఖాతాల నుంచి లాగ్ అవుట్ కావడం మరిచిపోవద్దు.
☞ సురక్షితమైన బ్రౌజింగ్ కోసం యాంటీవైరస్, యాంటీమాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను వాడండి.అదృశ్య నేత్రాలు..
అవును. మన ఆన్లైన్ జీవితాన్ని, కదలికల్ని, బ్రౌజింగ్ చరిత్రను కొన్ని అదృశ్య నేత్రాలు గమనిస్తూ ఉంటాయి. ఆ సమాచారాన్ని బట్టి అమెజాన్, ఈబే, నెట్‌ఫ్లిక్స్.. మొదలైన వెబ్‌సైట్స్ మన అభిరుచుల్ని, అవసరాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాయి. మన ఆలోచనల్ని బేరీజు వేస్తాయి. వాటి ఆధారంగా సొమ్ము చేసుకోవాలని ఆరాటపడతాయి. గూగుల్, ఫేస్బుక్ చేసేదీ ఈ పనే.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Tech Tips | ఫేస్బుక్లో స్పామర్ల బారిన పడి మోసపోవద్దంటే ఈ టిప్స్‌ను కచ్చితంగా పాటించండి
Tech Tips | మీ ఫోన్ పోయిందా? సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు మస్ట్!
“Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?”