Facebook Alert | కొందరు ఆగంతకులు, దుండగులు మెసేజ్ చాటింగ్స్ స్క్రీన్ షాట్లు తీసుకుని బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక అటువంటి సమస్య తలెత్తకుండా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్లకు రక్షణ కల్పించేంందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి నుంచి ఫేస్బుక్ మెసేంజర్‌లో మీరు చేసిన చాట్‌ను ఎవరైనా స్క్రీన్‌షాట్ తీయడానికి ప్రయత్నిస్తుంటే.. ఆ వెంటనే గుర్తించేలా.. అలర్ట్ అయ్యేలా నోటిఫికేషన్ పంపుతుందట. ఈ అలర్ట్ వ్యవస్థ.. వానిష్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే పని చేసేది. కానీ ఇప్పుడు అన్ని రకాల చాట్స్‌కు వర్తింపజేస్తూ కొత్త ఫీచర్ తీసుకురానున్నది.
‘యూజర్ల భద్రతకు రక్షణ కల్పనతోపాటు డిజప్పియర్ మెసేజెస్ సైతం స్క్రీన్ షాట్ తీసుకున్న యూజర్ల దృష్టికి తేవడమే తమ ఉద్దేశం అని ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాదు.. మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తోపాటు ఇన్‌స్టాలో లాంగ్ ప్రెస్ చేస్తే మెసేజ్ ఫార్వర్డయ్యే ఆప్షన్ ఫేస్బుక్ మెసేంజర్‌లోనూ తీసుకొచ్చామన్నది.
ఇక ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్లకు వెరిఫైడ్ బ్యాడ్జి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నది. దీనివల్ల ధ్రువీకృత యూజర్లు సురక్షితంగా మాట్లాడుకునే.. చాటింగ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇతరుల నుంచి వచ్చే ఫోటోలు, వీడియోలనూ లాంగ్ ప్రెస్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. వీడియోల్లో ఆడియో ఎడిటింగ్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానున్నది.