న్యూఢిల్లీ : ఏఐ టూల్ చాట్‌జీపీటీ(ChatGPT)తో కొలువుల కోత భయాలు టెకీలను వెంటాడుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు ఇప్పటికే మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతుండగా తాజాగా ఏఐ టూల్స్ తమ కొలువులకు ఎసరు పెడతాయని టెకీల్లో గుబులు రేగుతోంది. గత ఏడాది నవంబర్‌లో చాట్‌జీపీటీ యూజర్ల ముందుకొచ్చినప్పటి నుంచి టెక్ ప్రపంచంలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
లాంఛ్ అయిన కొద్దిరోజులకే ఏఐ ఆధారిత చాట్‌బాట్‌కు యూజర్ల నుంచి విశేష ఆదరణ పొందింది. కవితలు రాయడం నుంచి విద్యార్ధుల హోంవర్క్ క్లియర్ చేయడం వరకూ పుస్తకాలనూ రాసేస్తూ చాట్‌జీపీటీ ఏఐ రంగంలో పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే చాట్‌జీపీటీ క్రమంగా ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పనిప్రదేశాల్లో మనుషుల స్ధానంలో చాట్‌జీపీటీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని తాజా సర్వే వెల్లడించింది.
ఈ సర్వేలో పాల్గొన్న అమెరికన్ కంపెనీల్లో యాభై శాతం కంపెనీలు చాట్‌జీపీటీని వాడుతున్నట్టు తెలిపాయి. జాబ్ అడ్వైజ్ ప్లాట్‌ఫాం రెజ్యూమ్‌బిల్డర్.కాం నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పలు అమెరికన్ కంపెనీలు ఉద్యోగుల స్ధానంలో చాట్‌జీపీటీని వాడటం ప్రారంభించాయని తెలిసింది. ఈ సర్వేలో 1000 మంది బిజినెస్ లీడర్లు పాల్గొనగా మనుషుల స్ధానంలో చాట్‌జీపీటీ సేవలు తీసుకుంటున్నామని సగం మంది వెల్లడించారు.
వైరల్ చాట్‌బాట్ పనితీరుపై బిజినెస్ లీడర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. చాట్‌జీపీటీ అందించిన సేవలు అద్భుతంగా ఉన్నాయని 55 శాతం మంది బిజినెస్ లీడర్లు తెలిపారని ఈ సర్వే వెల్లడించింది. 34 శాతం మంది చాట్‌జీపీటీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. ఇక కొన్ని ఉద్యోగ బాధ్యతలను చాట్‌జీపీటీతో రీప్లేస్ చేయాలని యాజమాన్యాలు భావిస్తున్నాయని లేటెస్ట్ సర్వే ఫలితాలు సంకేతాలు పంపాయి.
Read More :
Job Notifications | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ