SVB Collapse | స్టార్టప్ సంస్థలకు నిధులు అందించే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) దివాళా తీయడంతో ఇండియన్ స్టార్టప్ సంస్థలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని వెంచర్ క్యాపిటలిస్ట్ అశు గార్గ్ (Asu Garh) తెల్చి చెప్పారు. ఇండియన్ స్టార్టప్ రంగానికి పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు. ఎస్వీబీ దివాళా తీయడంతో ఒక్క రాత్రిలోనే తీవ్రమైన అస్థిరత, అనిశ్చిత పరిస్థితులు మిగిల్చిందన్నారు. త్వరలోనే ఈ సంక్షోభానికి పరిష్కారం లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. అశుగార్గ్ రెండు దశాబ్దాలుగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వెంచర్ క్యాపిటలిస్టుగా, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్‌గా సేవలందిస్తున్నారు.
భారత్‌లోని స్టార్టప్‌లకు ఎస్వీబీ మద్దతు ఇచ్చిందని అశు గార్గ్ చెప్పారు. అమెరికాలో బిజినెస్ చేయాలని తలపెట్టిన ఇండియన్ స్టార్టప్ కంపెనీలు అత్యధికం ఎస్వీబీ సేవలే వినియోగించుకున్నాయని తెలిపారు. భారతీయ బ్యాంకులతో కలిసి పని చేయడానికి ఎస్వీబీ ముందుకు రావడమే ఇందుకు కారణం అని అన్నారు. కానీ, అమెరికన్ బ్యాంకుల్లో అత్యధికం విదేశీ ఖాతాదారులతో పని చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదని వెల్లడించారు. కానీ అమెరికా ఉద్యోగులు లేని స్టార్టప్ సంస్థలకు కూడా ఎస్వీబీ తమ సేవలను విస్తరించిందన్నారు.
సిలికాన్ వ్యాలీలో సేవలందిస్తున్న చాలా స్టార్టప్ సంస్థలు, టెక్ సంస్థలు కొన్నేండ్లుగా ఎస్వీబీతో కలిసి పని చేయడానికి మొగ్గు చూపాయని అశు గార్గ్ చెప్పారు. స్టార్టప్‌ల పనితీరు ఎస్వీబీ బాగా అర్థం చేసుకున్నదని తెలిపారు. స్టార్టప్ సంస్థలతో ఎలా వ్యవహరించాలో ఎస్వీబీ బ్యాంకు తెలిసి ఉండటమే కారణమన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్వీబీ పతనం అయితే ఇండియన్ స్టార్టప్ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఏర్పాటైన ప్రతి మూడు స్టార్టప్ సంస్థల్లో ఒకటి ఇండో-అమెరికన్లు స్థాపించారని తెలుస్తున్నది. ఇటువంటి స్టార్టప్ సంస్థలన్నీ వారంలోపే తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటాయని టెక్, సాఫ్ట్వేర్ నిపుణులు భావిస్తున్నారు. ఈ సంక్షోభం వల్ల ఈ స్టార్టప్ సంస్థల ఉద్యోగులకు కంపెనీలు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటాయని సమాచారం. అమెరికాలో ఆఫీసు, ఉద్యోగి కూడా లేని స్టార్టప్‌లు కూడా ఎస్వీబీలో ఖాతాలు ఓపెన్ చేశాయని వినికిడి. ఎస్వీబీ పతనం ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త బ్యాంకింగ్ వ్యవస్థపైనే చూపొచ్చునని టెక్నాలజీ నిపుణులు, ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.