Redmi A5 | అత్యంత తక్కువ బడ్జెట్లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్ మీ కోసమే. చవక ధరలకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించే కంపెనీగా పేరున్న షియోమీ లేటెస్ట్గా భారత్‌లో మరో బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ధర తక్కువ అయినప్పటికీ పలు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో లభిస్తున్నాయి. రెడ్మీ ఎ5 పేరిట మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఫోన్లో 6.88 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగిన ఎల్సీడీ డిస్ప్లే కావడం విశేషం. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లేపై చాలా నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ప్రస్తుతం మిడ్ రేంజ్ ఫోన్లలోనే ఇలాంటి రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. కానీ ఈ ఫీచర్ బడ్జెట్ ధర కలిగిన ఈ ఫోన్లో లభిస్తుండడం విశేషం.
ఇక రెడ్మీ ఎ5 స్మార్ట్ ఫోన్లో కేవలం 4జి మాత్రమే లభిస్తుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో యూనిసోక్ టి7250 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. మరో 4జీబీ వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. అందువల్ల బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ ఇది వేగంగానే పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లో వెనుక వైపు 32 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో సెకండరీ కెమెరాను కూడా ఇచ్చారు. అత్యంత పలుచనైన డిజైన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్లో లభిస్తుంది. ఈ ఫోన్‌కు గాను 2 మేజర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది.
రెడ్మీ ఎ5 స్మార్ట్‌ఫోన్‌ను పాండిచేరి బ్లూ, జస్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. స్మడ్జ్ రెసిస్టెంట్ ఫినిషింగ్ ఇచ్చారు. అందువల్ల ఫోన్‌పై ఫింగర్ ప్రింట్ ముద్రలు అంత సులభంగా పడవు. ఈ ఫోన్‌కు పక్క వైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ లో 5200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్లో బ్యాటరీ ఒక ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో మెమొరీని కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లతోపాటు మైక్రో ఎస్డీ కార్డును కూడా వేసుకోవచ్చు. మూడింటికీ ప్రత్యేక స్లాట్లను ఇచ్చారు.
ఈ ఫోన్లో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను ఇచ్చారు. ఎఫ్ఎం రేడియో కూడా వస్తుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. రెడ్మీ ఎ5 ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.6499 ఉండగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7499గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్లైన్ స్టోర్, షియోమీ రిటెయిల్ స్టోర్స్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయిస్తారు.