POCO F7 | ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలోనే ఫ్లాగ్ షిప్ తరహా ఫీచర్లను అందజేస్తున్నాయి. అందులో భాగంగానే లేటెస్ట్గా షియోమీ కూడా తన పోకో బ్రాండ్ నుంచి ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పోకో ఎఫ్7 పేరిట లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మిడ్ రేంజ్లో ఉండగా, ఫీచర్లు మాత్రం ఫ్లాగ్ షిప్ రేంజ్లో ఉన్నాయి. పోకో ఎఫ్7 స్మార్ట్ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.83 ఇంచుల 1.5కె ఎల్టీపీఎస్ ఫ్లాట్ స్క్రీన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్లో 3200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో అధునాతన స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్4 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. డ్యుయల్ లూప్ 3డి ఐస్ లూప్ కూలింగ్ టెక్నాలజీని ఇందులో ఏర్పాటు చేశారు కనుక ఫోన్‌ను ఎంత తీవ్రంగా వాడినా త్వరగా హీట్ అవ్వదు.
ఇక ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత హైపర్ ఓఎస్2ను అందిస్తున్నారు. దీనికి గాను 4 ఓఎస్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు గాను ఐపీ66/68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను కూడా ఇచ్చారు. ఇక ఈ ఫోన్లో ఏకంగా 7550 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇస్తుండడం విశేషం. ఇది 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 22.5 వాట్ల రివర్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. 1600 సార్లు బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ పెట్టిన తరువాత కూడా ఫోన్ బ్యాటరీ లైఫ్ 80 శాతం వరకు ఉంటుందని కంపెనీ తెలియజేసింది.
ఈ ఫోన్లో 12 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ కెమెరాలతో 4కె వీడియోలను అత్యంత క్వాలిటీగా చిత్రీకరించుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. అలాగే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంది. యూఎస్బీ టైప్ సి ఆడియోను ఆస్వాదించవచ్చు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
పోకో ఎఫ్7 స్మార్ట్ ఫోన్ ఫ్రాస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్, సైబర్ సిల్వర్ ఎడిషన్ మోడల్స్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.33,999గా ఉంది. లాంచింగ్ కింద పలు ఆఫర్లను కూడా ఈ ఫోన్‌పై అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ ఇస్తారు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ.2000 వరకు అదనపు బోనస్ పొందవచ్చు. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ కింద ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 1 సంవత్సరం పాటు అడిషనల్ వారంటీని సైతం అందిస్తున్నారు. రూ.10వేల విలువ గల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్‌ను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను జూలై 1వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.