POCO C71 | ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తూ వాటిని చాలా తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నాయి. ఒకప్పుడు కెమెరా ఉన్న ఫోన్ కావాలంటేనే రూ.20వేలకు పైగా వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఐదారు వేల రూపాయల ఫోన్లలోనూ కెమెరాలను అందిస్తున్నారు. ఇదంతా టెక్నాలజీ రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మకమైన మార్పుల వల్లే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే తయారీ కంపెనీలు కూడా పోటీలు పడి మరీ బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను రూపొందించి అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోకో లేటెస్ట్గా ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
పోకో నుంచి లేటెస్ట్గా పోకో సి71 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 6.88 ఇంచుల డిస్ప్లే లభిస్తుంది. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను ఇచ్చారు. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇది కలిగి ఉంటుంది. అందువల్ల తెరపై దృశ్యాలు అత్యంత నాణ్యంగా కనిపిస్తాయి. అలాగే వెట్టచ్ డిస్ప్లే అనే ఫీచర్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. దీని వల్ల తడి చేతులతో డిస్ప్లేను టచ్ చేసినా కూడా రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్లో యూనిసోక్ టి7250 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా 6జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 6జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 2 ఏళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్ను ఇస్తామని, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయని కంపెనీ తెలియజేసింది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌కు పక్క వైపున అమర్చారు. 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను ఇచ్చారు. డ్యుయల్ బ్యాండ్ వైఫై సదుపాయం కూడా ఉంది. పవర్ బ్లాక్, డిజర్ట్ గోల్డ్, కూల్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కాగా ఇందులో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. మెమొరీని కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. ఒక మైక్రో ఎస్డీ కార్డుతోపాటు రెండు సిమ్‌లను ఏకకాలంలో వేసి ఉపయోగించవచ్చు. వెనుక వైపు 12 మెగాపిక్సల్ కెమెరా ఫ్లాష్ సదుపాయంతో ఉంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఎఫ్ఎం రేడియో సదుపాయం లభిస్తుంది. ఐపీ52 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.
డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇందులో 5జి లేదు. కేవలం 4జి మాత్రమే లభిస్తుంది. పోకో సి71 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.6499 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7499గా ఉంది. ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ను విక్రయించనున్నారు. ఎయిర్ టెల్ వినియోగదారులు ఈ ఫోన్‌ను రూ.5,999కే సొంతం చేసుకునే ఆఫర్‌ను అందిస్తున్నారు.