OPPO A6x 5G | ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్లలో ఏఐ ఫీచర్లను వినియోగదారులకు అందించేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. బడ్జెట్ ధరలో అందిస్తున్న ఫోన్లలోనూ ఈ ఫీచర్లు ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి ఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇక కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే ఏఐ ఫీచర్లు కలిగిన ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇక ఇదే కోవలో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఎ6ఎక్స్ 5జి పేరిట ఈ ఫోన్‌ను ఒప్పో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకునే ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
ఒప్పో ఎ6ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. కనుక డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్‌కు 1125 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 6జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఇందులో ఏఐ గేమ్ బూస్ట్ అనే ఏఐ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో గేమర్స్ గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సెట్టింగ్‌ను ఆన్ చేయవచ్చు. దీంతో ఎలాంటి గ్లిచ్, ల్యాగ్ లేకుండా గేమ్స్‌ను ఆడుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే ఈ ఫోన్లో ఏఐ లింక్ బూస్ట్ 3.0 అనే మరో ఏఐ ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. దీని వల్ల నెట్ వర్క్ సిగ్నల్ సరిగ్గా లేని సమయంలోనూ యూజర్లు వీలైనంత వరకు నాణ్యమైన కాల్స్ చేసుకునే వీలు కలుగుతుంది.
ఈ ఫోన్ కేవలం 8.58 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. 212 గ్రాములు బరువు ఉంటుంది. ఈ ఫోన్ మెటాలిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. కనుక ప్రీమియం లుక్ వచ్చింది. పూర్తిగా ఫ్లాగ్ షిప్ ఫోన్ మాదిరిగా కనిపించేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ ఫోన్లో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీన్ని ఈ ఫోన్‌కు ఉన్న మరో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్ 882 గంటల స్టాండ్ బై టైమ్‌ను, 22.4 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు ఉన్న బ్యాటరీకి గాను 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 1 నుంచి 41 శాతం చార్జింగ్ పూర్తయ్యేందుకు 30 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
ఒప్పో ఎ6ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ ను 4జీబీ, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఇందులో ర్యామ్‌ను అదనంగా మరో 6జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. అందువల్ల ఫోన్‌ను ల్యాగ్ లేకుండా ఆపరేట్ చేయవచ్చు. ఈ ఫోన్ మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. డ్యుయల్ సిమ్‌లను ఇందులో వేసుకోవచ్చు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంది. 5జి సేవలను ఇందులో ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా ఇందులో ఉంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
ఒప్పో ఎ6ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,499 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,499గా ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో స్టోర్స్, అన్ని ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌పై 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.