Nokia Phones | స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతున్న సమయంలోనూ ఫీచర్ ఫోన్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని నోకియా సరికొత్త మొబైళ్లను తీసుకొచ్చింది. 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో నాలుగు కొత్త ఫోన్లను ఆవిష్కరించింది. Nokia 235 4G (2026), Nokia 215 4G (2026), Nokia 210 4G, Nokia 200 4G మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. అయితే వీటి ధరలు, విక్రయ తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
నోకియా తీసుకొచ్చిన ఈ నాలుగు ఫోన్లలోనూ 4జీ కనెక్టివిటీ, S30 ఆపరేటింగ్ సిస్టమ్, 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 32జీబీ వరకు స్టోరేజీని విస్తరించుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే వైర్డ్, వైర్లెస్ ఎఫ్ఎం రేడియా, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5మి.మి. హెడ్‌ఫోన్ జాక్ అందించారు.
ఈ ఫోన్లలో అత్యంత ప్రత్యేక ఫీచర్‌గా ఏఐ అసిస్టెన్స్ బటన్ అని చెప్పొచ్చు. ఈ బటన్‌ను నొక్కి వాయిస్ కమాండ్లతో టార్చ్ లైట్ ఆన్ చేయడం, అలారం లేదా రిమైండర్ సెట్ చేయడం, కాంటాక్ట్స్‌లోని వ్యక్తికి కాల్ చేయడం వంటివి చేయవచ్చు.
ఈ ఫోన్లో 2.8 అంగుళాల IPS QVGA డిస్ప్లే ఉంది. వెనుకవైపు LED ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో VGA సెల్ఫీ కెమెరాను అందించారు. 64ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉండగా.. మైక్రో SD కార్డ్ ద్వారా 32జీబీ వరకు స్టోరేజీ విస్తరించుకునే అవకాశం ఉంది. 1450mAh బ్యాటరీతో 10 గంటల టాక్‌టైమ్, 12 రోజుల స్టాండ్‌బై లభిస్తోందని నోకియా కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్లో 2.8 అంగుళాల IPS QVGA డిస్ప్లే ఉంది. ముందు భాగంలో VGA సెల్ఫీ కెమెరాను అందించారు. 6ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉండగా.. మైక్రో SD కార్డ్ ద్వారా 32జీబీ వరకు స్టోరేజీ విస్తరించుకునే అవకాశం ఉంది. 1450mAh బ్యాటరీతో వస్తుంది.
ఈ రెండు మోడళ్లలోనూ 2.4 అంగుళాల QVGA డిస్ప్లే ఉంది. నోకియా 210లో వెనుకవైపు VGA కెమెరాతో పాటు LED ఫ్లాష్, ముందు భాగంలో VGA కెమెరా అందించారు. అదే నోకియా 200 4జీలో వీజీఏ కెమెరా మాత్రమే ఉంది. రెండింటిలోనూ 64ఎంబీ ర్యామ్, 128 ఎంబీ స్టోరేజ్ అందించారు. రెండింటిలోనూ 32జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ లభిస్తుంది. 1450mAh బ్యాటరీతో 9 గంటల టాక్ టైమ్, 13 రోజుల స్టాండ్‌బై లభిస్తోంది.
ఫీచర్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఏఐ అసిస్టెన్స్, 4జీ కనెక్టివిటీ, USB Type C చార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లను అందించడం ద్వారా నోకియా కంపెనీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు.