ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ఉపయోగించే వారందరికీ ‘‘స్కిప్ ఇంట్రో’’ అనే బటన్ సుపరిచితమే. మంచి ఇంట్రస్టింగ్ సిరీస్ చూసే సమయంలో ప్రతిసారీ ఇంట్రో క్రెడిట్స్ చూడాల్సిన అవసరం లేకుండా.. ఈ బటన్ నొక్కితే సరిపోతుంది. ఈ బటన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు ప్రతి రోజు 136 మిలియన్ల సార్లు ఉపయోగిస్తున్నారని తాజాగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
అంటే ఒక్కరోజులో సుమారు 195 సంవత్సరాల యూజర్ల సమయాన్ని ఈ బటన్ ఆదా చేసిందట. ఈ ఆలోచన ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు నెట్‌ఫ్లిక్స్ డైరెక్టర్ ప్రొడక్ట్ ఇన్నొవేషన్ – స్టూడియో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అధికారి అయిన కామెరాన్ జాన్సన్ వివరణ ఇచ్చారు. అంతకుముందు పదిసెకన్లు ముందుకు లేదా వెనక్కు వెళ్లడానికి అవకాశం ఉండేలా బటన్‌ను తీసుకురావాలని వాళ్లు అనుకున్నారట..
కానీ అసలు ప్రోగ్రాం చూడకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం లేకపోవడంతో అసలు ఇది అవసరమా? అనే ఆలోచనలో పడిపోయారట. అలాంటి సమయంలోనే ప్రముఖ సిరీస్ ‘‘గేమ్ ఆఫ్ త్రోన్స్’’ ఆ కారణం ఇచ్చిందని కామెరాన్ చెప్పారు.
‘‘ఈ ప్రోగ్రాం స్టార్టింగ్‌లో వచ్చే పాపులర్ సాంగ్, అందమైన ఓపెనింగ్ నాకు ఒక కారణం ఇచ్చాయి. నాకు ఈ ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం. కానీ ప్రతిసారీ ఓపెనింగ్ క్రెడిట్స్ చూడాల్సి వచ్చేంది. వాటిని స్కిప్ చేయడం కోసం ప్రతిసారీ ముందుకు స్కిప్ చేయడానికి చిరాకేసింది. నాలాగే ఇంకా ఎవరికైనా అనిపిస్తుందా? అనే అనుమానం వచ్చింది’’ అని ఆయన తెలిపారు.
ఆ తర్వాత వ్యూహాత్మకంగా ‘‘స్కిప్ ఇంట్రో’’ బటన్‌ను చాలా తక్కువ సంఖ్యలో యూకే, యూఎస్, కెనడాలో అది కూడా కేవలం 250 కార్యక్రమాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది సక్సెస్ కావడంతో 2017లో టీవీల్లో ఆ మరుసటి సంవత్సరం మే నెలలో మొబైల్స్‌లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని కామెరాన్ వివరించారు.