motorola edge 60 | ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న చాలా వరకు మిడ్ రేంజ్ ఫోన్లలోనే ఫ్లాగ్ షిప్ లాంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ తరహా స్మార్ట్ ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందించడంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే మోటోరోలా తాజాగా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను ఈ సెజ్‌మెంట్‌లో విడుదల చేసింది. మోటోరోలా కంపెనీ లేటెస్ట్గా ఎడ్జ్ 60 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇందులో 6.67 ఇంచుల 1.5కె డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది క్వాడ్ కర్వ్డ్ పీఓలెడ్ డిస్ప్లే, పైగా 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. అందువల్ల డిస్ప్లే చాలా అద్భుతమైన దృశ్యాలను వీక్షించే అనుభూతిని అందిస్తుంది. ఇక ఈ డిస్ప్లేకు గాను గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను సైతం అందిస్తున్నారు.
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉండగా 12 జీబీ వరకు ర్యామ్ అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి 3 ఓఎస్ అప్ డేట్స్, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో మోటో ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. దీని సహాయంతో క్యాచ్ మి అప్, రియల్ టైమ్ ట్రాన్ స్క్రిప్షన్, పే అటెన్షన్, పర్సనలైడ్జ్ మెమొరీ రికాల్ వంటి సదుపాయాలను వాడుకోవచ్చు. ఈ ఫోన్‌కు గాను ఐపీ68 ప్లస్ ఐపీ69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీనికి మిలిటరీ గ్రేడ్ నాణ్యత సర్టిఫికేషన్ కూడా ఉంది. అందువల్ల ఫోన్ అంత సులభంగా పగలదు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్పల్ మెయిన్ కెమెరా ఉండగా మరో 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు. మరో 10 మెగాపిక్సల్ 3ఎక్స్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. దీని సహాయంతో 50ఎక్స్ వరకు హైబ్రిడ్ జూమ్ లభిస్తుంది. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లో 5500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. ఫోన్‌తోపాటు చార్జర్‌ను కూడా బాక్స్‌లో అందిస్తున్నారు. 256జీబీ స్టోరేజ్ వేరియెంట్లో మాత్రమే ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. యూఎస్బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6ఇ, బ్లూటూత్ 5.4 వంటి అదనపు పీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.
మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్‌ను పాంటోన్ గిబ్రాల్టర్ సీ కలర్, పాంటోన్ షామ్రాక్ కలర్ వేరియెంట్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ సింగిల్ వేరియెంట్ ధర రూ.25,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు మోటోరోలా ఆన్లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో జూన్ 17 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్‌పై ఆఫర్‌ను అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు.