Microsoft-ChatGPT | టెక్ దిగ్గజాలు గూగుల్.. మైక్రోసాఫ్ట్ ఒకదానితో మరొకటి పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాయి. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో దూసుకొస్తున్న చాట్ జీపీటీ అందుకు వేదిక కాబోతున్నట్లు తెలుస్తున్నది. నెటిజన్లు .. ప్రతి ఒక్కరూ తామేదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే సెర్చింజన్ గూగుల్’నే ఆశ్రయిస్తారు. కానీ.. గూగుల్’కు పోటీగా చాట్ జీపీటీ ఎంటరైంది. గతేడాది నవంబర్లోనే మార్కెట్ లోకి దూసుకొచ్చిన చాట్ జీపీటీ.. గూగుల్‌కు సరి జోడుగా నిలిచింది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలువురు నెటిజన్లు తమకు తెలియని విషయాలు, కొత్త సమాచారం కోసం చాట్ జీపీటీని ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.. అటువంటి చాట్ జీపీటీ పేరెంట్ సంస్థ `ఓపెన్ ఏఐ` లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే 100 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. తాజాగా మరో 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. దీనిపై ఓపెన్ ఏఐ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ అధికారికంగా స్పందించలేదు.
ఓపెన్ ఏఐ ప్రస్తుతం కంపెనీలోని షేర్ హోల్డర్ల షేర్లను విక్రయించాలని నిర్ణయానికి వచ్చినట్లు ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఓపెన్ ఏఐ కంపెనీ విలువ 29 బిలియన్ డాలర్లుగా గణించినట్లు సమాచారం. ఈ వాటాదారుల షేర్ల విక్రయం కోసం మైక్రో సాఫ్ట్తోపాటు పలు వెంచర్ క్యాపిటల్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇరు సంస్థల మధ్య చర్చలు ఫలిస్తే ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్‌కు 49 శాతం, ఇతర ఇన్వెస్టర్లకు మరో 49 శాతం వాటాలు దక్కుతాయని పలు ఆంగ్ల దిన పత్రికల్లో వార్తలొచ్చాయి. మిగతా రెండు శాతం వాటా ఓపెన్ ఏఐ నాన్ ఫ్రాపిట్ పేరెంట్ సంస్థ వద్దే అట్టిపెట్టుకోనున్నది.
శాన్ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ (Artificial Intellegence) సాయంతో రూపొందించిన సాఫ్ట్ వేరే ఈ చాట్ జీపీటీ. 2015లో శామ్ ఆల్ట్మాన్, ఎలన్ మస్క్ సంయుక్తంగా 100 కోట్ల డాలర్లతో ఈ సంస్థను ప్రారంభించారు. 2018లో ఎలన్ మస్క్ వైదొలిగినా.. పెట్టుబడులు పెడుతున్నారు. 2019లో మైక్రో సాఫ్ట్ కూడా `ఓపెన్ ఏఐ`లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.
చాట్ జీపీటీని ఇంకా ప్రయోగాత్మకంగానే భావిస్తున్నారు. యూజర్లకు ఇప్పటికైతే ఉచితంగానే అందుబాటులో ఉంది. ఆసక్తి కల యూజర్లు, నెటిజన్లు ఓపెన్ ఏఐ డాట్ కామ్ వెబ్ సైట్ లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. అటుపై ఈ టూల్‌ను ఉపయోగించుకుని చూడొచ్చు. తన బింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా ఫీచర్ తీసుకు రావాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సెర్చింజన్’గా గుర్తింపు తెచ్చుకున్న గూగుల్’కు గట్టి పోటీ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ తలపోస్తున్నట్లు సమాచారం.