కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది పిల్లల్లో ప్రాణాంతక మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సీ) కనిపించిందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. వ్యాక్సినేషన్ వేసుకోని పిల్లలతోపాటు వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో కూడా ఇది కనిపించిందని తేల్చారు. ఒమిక్రాన్ సంక్రమణ తర్వాత అర మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు, టీనేజర్లపై డెన్మార్క్ పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో చాలామంది పిల్లల్లో ఎంఐఎస్సీ-సీ ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యాధిబారిన పడ్డ ప్రతి 12 మందిలో 11 మంది కొవిడ్ టీకా తీసుకోని పిల్లలుంటే.. టీకా తీసుకున్నవారు ఒకరు మాత్రమే ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇది అరుదైన సిండ్రోమ్ అయినప్పటికీ గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడులాంటి కీలక భాగాల్లో వాపు ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
కొవిడ్-19 టీకాలు తీసుకోని మిలియన్ల మంది పిల్లల్లో 34.9రెట్లు, టీకా తీసుకున్న మిలియన్ల మందిలో 3.7రెట్లు ఎంఐఎస్-సీ కేసులు గుర్తించినట్లు పరిశోధకులు జేఏఎంఏ పీడియాట్రిక్స్‌లో నివేదించారు. డెల్టా ప్రబలంగా ఉన్నప్పుడు టీకా వేయని పిల్లల్లో మిలియన్‌కు 290.7రెట్లు ఎంఐఎస్-సీ కేసులు, టీకా తీసుకున్న పిల్లల్లో మిలియన్‌కు 101.5రెట్లు ఎంఐఎస్-సీ కేసులు గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు. టీకాలు వేసుకున్న పిల్లల్లో ఎంఐఎస్-సీ ప్రమాదం గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. పిల్లలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని తమ అధ్యయనం సూచిస్తున్నదన్నారు.