Lava Yuva Smart 2 | బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్ మీ కోసమే. లావా మొబైల్స్ సంస్థ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. యువ స్మార్ట్ 2 పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. యువ సిరీస్‌లో లావా లాంచ్ చేసిన లేటెస్ట్ ఫోన్ ఇదే కాగా గతంలో వచ్చిన యువ స్మార్ట్ ఫోన్ కు కొనసాగింపుగా యువ స్మార్ట్ 2 ఫోన్‌ను విడుదల చేశారు. ఇక యువ స్మార్ట్ 2 ఫోన్లో 6.75 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ లభిస్తుంది. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఫోన్లో యూనిసోక్ 9863ఎ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్ ఉంది. ర్యామ్‌ను అదనంగా వర్చువల్‌గా మరో3 జీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఎలాంటి ల్యాగ్ ఉండదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో సెకండరీ ఏఐ కెమెరాను సైతం ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల సహాయంతో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. వీడియోలను సైతం చిత్రీకరించుకోవచ్చు. ఇందుకు గాను పోర్ట్రెయిట్, పనోరమ, హెచ్డీఆర్, బ్యూటీ మోడ్, నైట్ మోడ్, ఫిల్టర్స్, టైమ్ లాప్స్, క్యూఆర్ కోడ్, స్లో మోషన్ అనే ఫీచర్లను అందిస్తున్నారు.
ఈ ఫోన్లో ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి నాచ్ కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక వైపు ఉన్న కెమెరాలకు ఫ్లాష్ సదుపాయం కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. ఎఫ్ఎం రేడియో లభిస్తుంది. స్పీకర్లను కింది వైపు అమర్చారు.
ఇక ఈ ఫోన్లో 5జి సదుపాయం లేదు. కేవలం 4జి ని మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఆప్షన్‌ను ఇచ్చారు. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు. ఇక లావా యువ స్మార్ట్ 2 ఫోన్‌ను క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. వీటికి గ్లాస్ బ్యాక్‌ను ఇచ్చారు. కనుక ఫోన్ ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ ధర రూ.6099గా ఉంది. లావా రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను కొన్నవారికి సర్వీస్ ఎట్ హోమ్ అనే సదుపాయం లభిస్తుంది. అంటే కస్టమర్‌కు ఫోన్ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా సర్వీస్ చేసి ఇస్తారు.