విశ్వంలో మనకు తెలియని అంశం సమాచారం కావాలంటే ఇప్పటి వరకు గూగులమ్మే శరణ్యం.. కానీ కృత్రిమ మేధ సాయంతో గత కొన్ని నెలలుగా చాట్‌జీపీటీ అనే చాట్‌బోట్ (Chatbot) నెటిజన్లకు అందుబాటులోకి వచ్చింది. నెటిజన్లు అడిగిన సమాచారాన్ని చాట్ జీపీటీ అందిస్తున్నది. దీంతో టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ పాపులరైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే ఈ చాట్ బోట్.. గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తుందని టెక్నాలజీ రంగ ప్రముఖులు, సంస్థలు అభిప్రాయ పడ్డాయి. అంతే కాదు.. చాలా మంది బ్రౌజింగ్ కోసం చాలా మంది గూగులమ్మను కాక చాట్ జీపీటీ సేవలను ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తున్నది.
దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ స్పందించారు. త్వరలోనే గూగుల్లోనూ ఛాట్ జీపీటీ తరహా సేవలు యూజర్లకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మనం ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతో కీలకం. త్వరలో యూజర్లకు గూగుల్ బ్రౌజర్లో ఏఐ ఆధారిత సేవలు అందించనున్నాం. తద్వారా గూగుల్ యూజర్లు శక్తిమంతమైన, సరికొత్త ఏఐ ఆధారిత బ్రౌజర్ సేవలు పొందుతారు` అని అన్నారు. వచ్చే మే నెల నాటికి గూగుల్ నుంచి చాట్ జీపీటీ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అంతేకాదు.. ఐపీఐ డెవలపర్ల కోసం కొత్త టూల్స్ అందుబాటులోకి తేనున్నామని సుందర్ పిచ్ఛాయ్ చెప్పారు. వాటితో డెవలపర్లు సొంతంగా అప్లికేషన్స్ రూపొందించొచ్చునని చెప్పారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సుందర్ పిచ్చాయ్ ఈ సంగతి వెల్లడించారు. ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని చాట్ జీపీటీకి పోటీగా 20 ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు గూగుల్ డెవలప్ చేస్తున్నది.
ఇదిలా ఉంటే చాట్ జీపీటీనీ మరింత డెవలప్ చేయడానికి చాట్ జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ తరుణంలో త్వరలోనే గూగుల్ సెర్చింజన్లోనూ చాట్ జీపీటీ తరహా సేవలు అందుబాటులోకి తెస్తామని సుందర్ పిచ్చాయ్ వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.