నెల్లూరు: పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14 న ఉదయం ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 13 తెల్లవారుజామున కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు. ఈ ప్రయోగంలో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌తోపాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను కూడా ప్రయోగించనున్నారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ కేంద్రం పీఎస్ఎల్వీ సీ 52 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 14 న ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకుగాను ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగంలో భాగంగా షార్ సెంటర్లోని రెండో లాంచ్ ప్యాడ్‌కు నాలుగు దశల రాకెట్ అనుసంధానం ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.
ఈ ప్రయోగంలో 1,710 కిలోల రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (ఈఓఎస్-04) తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను కూడా ప్రయోగించనున్నారు. భారత్‌కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ), భూటాన్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్-2బీ ఉపగ్రహమైన ఇన్‌స్పైర్‌శాట్-1 ను కూడా ప్రయోగించనున్నారు. వాతావరణ పరిశోధన, వ్యవసాయం, అడవులు, వరద, విపత్తు పరిశోధన కోసం ఈ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తారు. ఈ నెల 12న మిషన్ రెడీనెస్ సమీక్ష నిర్వహించనున్నారు.