YouTube Shorts : నేటి తరంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారు. దీనివల్ల వారి కంటిచూపు మందగించే అవకాశం ఉంది. ఇతర అనారోగ్య, మానసిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇదంతా తెలిసినా కూడా పిల్లలచేత షార్ట్స్ వీడియోస్ చూసే అలవాటు మాన్పించడం కష్టం.
ఇలాంటివారి కోసమే ఇప్పుడు యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పిల్లలు రోజూ ఎంతసేపు షార్ట్స్ చూస్తున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాదు.. వారు షార్ట్స్ చూసే టైమ్ లిమిట్ సెట్ చేయవచ్చు. అంటే యూట్యూబ్ లో పిల్లలు ఎక్కువ సేపు షార్ట్స్ చూడకుండా ఈ ఫీచర్ ద్వారా నియంత్రించవచ్చు. దీనికోసం మీ మొబైల్ ఫోన్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి, టాప్ రైట్ కార్నర్లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్ పై ట్యాప్ చేసి, సెట్టింగ్స్ మెనూ ఎంచుకోవాలి. ఆ తర్వాత జనరల్ సెలెక్ట్ చేసుకుని, షార్ట్స్ ఫీడ్ లిమిట్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత ఎంత సేపు షార్ట్స్ చూడాలనుకుంటున్నారో ఆ టైమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి టైమ్ లిమిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇకపై షార్ట్స్ అంతకుమించి చూడటానికి వీలు లేదు. టైమ్ లిమిట్ పూర్తైతే స్క్రీన్ పై నోటిఫికేషన్ వస్తుంది. మళ్లీ చూడాలనుకుంటే మాత్రం తిరిగి కంటిన్యూ చేయొచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఐఓఎస్ డివైజెస్ పై ఈ ఫీచర్ పని చేస్తుంది.