human development | మనిషి అభివృద్ధికి సంబంధించిన ఓ దిగ్భ్రాంతికరమైన అంశాన్ని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. 25 వేల సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభాలో సగం మంది భారత్‌లోనే నివసించారని బీహెచ్‌యూ పరిశోధకులు వెల్లడించారు. ఇటీవల కాశీ తమిళ సంగమం విద్యా కార్యక్రమం 27 వ రోజున బీహెచ్‌యూ జన్యు శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ చౌబే ఈ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు.
‘ఆధునిక మానవులు ఆఫ్రికాలో పుట్టినప్పటికీ, వారు మన దేశంలోనే పెరిగారు. 25 వేల ఏండ్ల క్రితం ప్రపంచ జనాభాలో సగం మంది మన దేశంలో నివసించడానికి ఇదే కారణం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 25 వేల శాంపిళ్లను అధ్యయనం చేయడం ద్వారా ఈ ఫలితాలను రాబట్టారు’ అని ప్రొఫెసర్ చౌబే తెలిపారు. 25 వేల సంవత్సరాల క్రితం చాలా మంది ప్రజలు హిమాలయాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య భారత ద్వీపకల్పంలో నివసించారని, ఇక్కడ వారికి మంచి స్థానంతోపాటు ఆహారం కూడా లభించిందని చెప్పారు. దీని తర్వాత క్రమంగా ఈ ప్రజలు ఆసియా, ఇతర ద్వీపాలకు వ్యాపించారని, పురావస్తు శాస్త్రంలో దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.
25 వేల డీఎన్ఏ నమూనాలను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో యూరప్, పశ్చిమాసియా, తూర్పు ఆసియా, సైబీరియా, ఆఫ్రికా దేశాలకు చెందిన వెయ్యి డీఎన్ఏ నమూనాలతో భారతీయుల డీఎన్ఏను పోల్చారు. మన పూర్వీకుల గురించిన సమాచారం డీఎన్ఏలో మ్యుటేషన్ల రూపంలో లభ్యమవుతున్నది. శాస్త్రవేత్తలు ఈ సమాచారాన్ని డీకోడ్ చేసి దాని ఆధారంగా ఈ ఫలితాన్ని పొందారు.