Google Chrome | ఇంటర్నెట్ అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది గూగుల్ క్రోమ్ (Google Chrome). ఏదైనా సమాచారం అవసరమైనా నెటిజన్లు గూగుల్ క్రోమ్లోకే వెళతారు. సెక్యూరిటీ, ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది గూగుల్ క్రోమ్. అందువల్లే నెటిజన్లు తమకు అవసరమైన సమాచారం కోసం గూగుల్ క్రోమ్నే బ్రౌజ్ చేస్తుంటారు. అలా బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూజర్ల డేటా ఇతరులు పొందకుండా క్రోమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని గూగుల్ సూచిస్తూ ఉంటుంది. కానీ, కొందరు యూజర్లు పాత వర్షన్ బ్రౌజర్ మాత్రమే ఉపయోగిస్తుంటారు.
తాజాగా గూగుల్ క్రోమ్‌లో లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీం ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఐఎన్) తెలిపింది. యూజర్ల కంప్యూటర్లను హ్యాకర్లు తేలిగ్గా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
‘క్రోమ్ బ్రౌజర్లో కొన్ని లోపాలు ఉన్నాయి. వెబ్ ఆర్టీసీ అండ్ గెస్ట్ వ్యూ, టైప్ కన్ఫ్యూజన్ ఎర్రర్, వెబ్ ట్రాన్స్ పోర్ట్ అనే పేర్లతో లోపాలు ఉన్నాయని గుర్తించాం’ అని సీఈఆర్టీ-ఐఎన్ పేర్కొంది. ఈ లోపాల వల్ల యూజర్లు వాడే కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లను హ్యాకర్లు సులువుగా రిమోట్ యాక్సెస్ చేసి, వారు ప్రత్యేక డిజైన్‌తో తయారు చేసిన వెబ్ పేజీ మీద యూజర్లు క్లిక్ చేసేలా చేస్తారని హెచ్చరించింది.
అటుపై ఆ కంప్యూటర్లలో తేలిగ్గా మాల్వేర్ ప్రవేశపెట్టి, తమకు అవసరమైన డేటా దొంగిలిస్తారని సీఈఆర్టీ-ఐఎన్ పేర్కొంది. కనుక యూజర్లు క్రోమ్ 109.0.5414.119 (ఆపిల్/లైనెక్స్), 109.0.514.119/120 వర్షన్ల కన్నా ముందు వర్షన్ బ్రౌజర్లు వాడుతున్న యూజర్లు తక్షణం తమ బ్రౌజర్ అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేసుకోవడం ఎలా అనే అంశం తెలుసుకుందాం..
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. తదుపరి కుడి వైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ‘అబౌట్ క్రోమ్’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేశాక మీ బ్రౌజర్ అప్ డేట్ కాని పక్షంలో రీలాంచ్ చేసి అప్ డేట్ చేయాలి. ఒకవేళ మీ బ్రౌజర్ ఆటోమేటిక్‌గా అప్ డేట్ అయితే, మీకు లేటెస్ట్ వర్షన్ చూపుతుంది.