GSAT 7R | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-3ని నింగిలోకి పంపనున్నది. ఇండియన్ నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎల్వీఎం 3 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నవంబర్ 2న నింగిలోకి మోసుకెళ్లనున్నది. ఏపీలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనున్నది. ఈ ఉపగ్రహాన్ని జీశాట్ 7ఆర్ (GSAT-7R) అని పిలుస్తుంటారు. ఇది శాటిలైట్‌ను పూర్తిగా భారత సైన్యం అవసరాల కోసం తయారు చేసిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్.
దీని బరువు దాదాపు 4,400 కిలోల వరకు ఉంటుంది. ఇస్రో తొలిసారిగా భారీ బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్‌ను భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుండడం విశేషం. ఈ శాటిలైట్ భారత భూభాగంతో పాటు సముద్ర జలాల్లోనూ సేవలందిస్తుందని ఇస్రో తెలిపింది. ఈ శాటిలైట్ 2013లో ప్రయోగించిన జీశాట్ 7 రుక్మిణి స్థానంలో సేవలు అందించబోతున్నది. అడ్వాన్స్డ్ పేలోడ్స్‌తో తయారు చేసిన ఈ శాటిలైట్ హిందూ మహాసముద్రంతో పాటు కీలక ప్రాంతాల్లో నేవీ కార్యకలాపాలు కొనసాగించే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. వాయిస్, డేటా, వీడియో లింక్‌ల కోసం సీ, ఎక్స్టెండెడ్ సీ, క్యూ-బ్యాండ్స్‌లో కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
సైనిక అవసరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోని పౌర ఏజెన్సీలకు సైతం మెరుగైన డిజిటల్ సేవలు అందించడంలో జీశాట్ 7ఆర్ ఉపయోగపడనున్నది. ఈ ఉపగ్రహాన్ని రాకెట్‌తో అనుసంధానించి.. ఈ నెల 26న లాంచ్ ప్యాడ్‌పైకి తరలించినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా మూసుకెళ్లిన ఎల్వీఎం 2 రాకెట్‌కు ఇదో ఐదో మిషన్ కానున్నది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో ఇస్రో మరో భారీ శాటిలైట్ ప్రయోగం చేపట్టనున్నది. యూఎస్‌కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ తయారు చేసిన 6.5 టన్నుల బరువున్న బ్లూబర్డ్-6 శాటిలైట్‌ను సైతం ఇదే ఎల్వీఎం 3 రాకెట్ నింగిలోకి మూసుకెళ్లనున్నది. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.