న్యూఢిల్లీ : డిజిటల్ న్యూస్ పబ్లిషర్లకు ఊరట కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. న్యూస్ పబ్లిషర్లతో గూగుల్, ఫేస్‌బుక్‌లు ఆదాయం పంచుకునేలా ఐటీ చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా న్యూస్ పబ్లిషర్ల కంటెంట్‌ను సోషల్ మీడియా దిగ్గజాలు వాడుతుండటంతో దానిపై వచ్చిన రాబడిని పబ్లిషర్లతో గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు పంచుకునేలా అవసరమైన సవరణలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది.
ఇటీవల కెనడా ప్రభుత్వం డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు, గూగుల్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ వేదికల మధ్య రాబడి పంపకాల్లో పారదర్శకత ఉండేలా చట్టం తీసుకురాగా భారత్‌లోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీడియా సంస్ధల కంటెంట్‌పై గూగుల్, ఫేస్‌బుక్‌లు ఆదాయం పొందుతుండగా దీనిలో పబ్లిషర్ల వాటా చెల్లించడంలో అవి విఫలమవుతున్నాయనే ఫిర్యాదులున్నాయి. నూతన పబ్లిషర్ల విషయంలో ఆన్లైన్ వేదికలు రాబడిలో సరైన వాటాను తమకు చెల్లించడం లేదని, టెక్ దిగ్గజాలు తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాయని మండిపడుతున్నారు.
ఈ లోపాలను అధిగమించి గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్ దిగ్గజాలు న్యూస్ పబ్లిషర్లకు రాబడిని పంచడంలో పారదర్శకత ఉండేలా ఐటీ చట్టానికి ప్రభుత్వం సవరణలు తీసుకురావాలని యోచిస్తోంది. డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్‌పై టెక్ దిగ్గజాలు పట్టు సారించాయని, ఇది భారత మీడియా సంస్ధల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. నూతన చట్ట నిబంధనలు తీసుకువచ్చే నేపధ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.