Android PC | ప్రస్తుతం అందరికీ కంప్యూటర్లు అనగానే గుర్తుకు వచ్చేది మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. స్మార్ట్ ఫోన్ అనగానే గుర్తుకు వచ్చేది ఆండ్రాయిడ్ ఓఎస్. మీరు ఆండ్రాయిడ్ ప్రియులైతే మీకో గుడ్‌న్యూస్. త్వరలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే కంప్యూటర్లు రాబోతున్నాయి. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ పీసీని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇకపై మొబైల్ తరహా ఓఎస్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల్లో తీసుకురాబోతుందన్నమాట. వాస్తవానికి ప్రస్తుతం కంప్యూటర్ల ఓఎస్ విషయంలో మైక్రోసాఫ్ట్‌తో పాటు ఆపిల్ మ్యాక్ ఓఎస్ హవా కొనసాగుతున్నది. గూగుల్ క్రోమ్ ఓఎస్ పేరుతో ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా ఈ రెండు దిగ్గజ సంస్థలకు పోటీ ఇచ్చేందుకు మరోసారి పీసీ ఓఎస్‌పై దృష్టి పెట్టి ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పని చేస్తోంది. ఆండ్రాయిడ్, క్రోమ్ ఓఎస్‌లను విలీనం చేయనున్నది. ఈ విషయాన్ని హవాయిలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో గూగుల్ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రెండింటిని విలీనం చేయనున్నారని గతంలోనూ రూమర్స్ వినిపించాయి. క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో అమోన్‌తో సంభాషణల సందర్భంగా గూగుల్ ప్లాట్‌ఫారమ్, డివైజెస్ చీఫ్ రిక్ ఓస్టర్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
గతంలో తాము పీసీలు, స్మార్ట్ఫోన్ల కోసం పూర్తిగా వేర్వేరు వ్యవస్థలను తీసుకువచ్చాయని.. కానీ, రెండింటినీ విలీనం చేసేందుకు ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. తమ పీసీ, డెస్క్‌టాప్ కంప్యూటింగ్ సిస్టమ్‌లకు సాధారణమైన సాంకేతిక పునాదిని నిర్మిస్తున్నామని ఓస్టర్‌లో పేర్కొన్నారు. ఇది కొత్త దశ ఏఐని మరింత మెరుగుపరుస్తుందని ఓస్టర్‌లో తెలిపారు. ఏఐ జెమిని మోడల్, గూగుల్ అసిస్టెంట్, పీసీ స్పేస్‌లో మొత్తం డెవలపర్ కమ్యూనిటీని ఉపయోగించుకునే మరొక మార్గమని.. ప్రతి కంప్యూటింగ్ వర్గంలోని ప్రజలకు ఆండ్రాయిడ్ సేవలు అందించగల మరో మార్గమని తాను భావిస్తున్నాన్నారు. క్వాల్కామ్ సీఈవో క్రిస్టియాలో గూగుల్ ప్రాజెక్టును ప్రశంసిస్తూ అద్భుతమని పేర్కొన్నారు. తాను దాన్ని చూశానని.. మొబైల్, పీసీలను విలీనం చేయాలనే కలను నెరవేరుస్తుందన్నారు. గూగుల్ గతంలో క్రోమ్ఓఎస్, ఆండ్రాయిడ్లను ఒకే ప్లాట్ఫామ్లోకి విలీనం చేయాలని కోరుకుంటున్నట్లుగా గతంలో ప్రకటించింది.
ఈ కొత్త ఆండ్రాయిడ్ పీసీ ప్రాజెక్ట్ ఆ దిశలో ప్రధాన అడుగు కావొచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. క్వాల్కమ్ మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిప్సెట్ వచ్చే ఏడాది అనేక హై-ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో రానున్నది. షియోమి తన షియోమి 17 సిరీస్‌లో ఈ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు ధ్రువీకరించింది. వన్ ప్లస్ 15, ఐక్యూ 15, రియల్ మీ 8 ప్రోమవంటి ఇతర డివైజ్‌లు సైతం ఇదే ప్రాసెస్‌తో వచ్చే అవకాశం ఉంది.