Galaxy Tab Active5 Enterprise Edition | శాంసంగ్ కంపెనీ వ్యాపారస్తుల కోసం ఓ నూతన ట్యాబ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. గెలాక్సీ ట్యాబ్ యాక్టివ్ 5 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ పేరిట ఈ ట్యాబ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేకంగా ఈ ట్యాబ్‌ను రూపొందించామని కంపెనీ చెబుతోంది. గెలాక్సీ ట్యాబ్ యాక్టివ్ 5 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ట్యాబ్‌లో 8 ఇంచుల హై రిజల్యూషన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ట్యాబ్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ట్యాబ్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు.
ఈ ట్యాబ్ లో బ్యాటరీని రీప్లేస్ చేసుకునే విధంగా ఇచ్చారు. అందువల్ల ట్యాబ్ బ్యాటరీ అయిపోతుందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. అలాగే బ్యాటరీ లేకున్నా కేవలం పవర్‌తోనే పనిచేసే విధంగా ఇందులో ప్రత్యేకంగా నో బ్యాటరీ మోడ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల విద్యుత్ సదుపాయం ఎక్కడ ఉంటే అక్కడ దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దీనికి గాను 7 ఏళ్ల వరకు ఓఎస్ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ 21 ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చే వరకు ఈ ట్యాబ్ పనిచేస్తుందని కంపెనీ తెలియజేసింది. ఈ ట్యాబ్‌కు గాను శాంసంగ్ 36 నెలల వారంటీ సదుపాయాన్ని, 12 నెలల వరకు బ్యాటరీపై వారంటీని అందిస్తోంది. అలాగే ప్రత్యేక ప్లాన్లను తీసుకుంటే అదనపు వారంటీ వాలిడిటీని పొందవచ్చు.
ట్యాబ్‌ను హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉంచేందుకు గాను ఈ ట్యాబ్‌కు ప్రత్యేకంగా నాక్స్ సూట్ ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. రూ.4515 విలువ గల ఏడాది సబ్స్క్రిప్షన్ ఈ ట్యాబ్‌కు ఉచితంగా లభిస్తుంది. ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్‌ను ఈ ట్యాబ్‌కు అందిస్తున్నారు. దీన్ని మిలిటరీ గ్రేడ్ నాణ్యత, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో రూపొందించారు. అందువల్ల ట్యాబ్ ఎంత ఎత్తు నుంచి కింద పడ్డా అంత సులభంగా పగలదని కంపెనీ చెబుతోంది. ఫ్యాక్టరీలు, కన్ స్ట్రక్షన్ సైట్లలో ఈ ట్యాబ్‌ను ఉపయోగిస్తే మాటలు గట్టిగా వినబడేందుకు వీలుగా ఇందులో లౌడ్ అండ్ క్లియర్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఈ ట్యాబ్‌కు ఒక ఎస్ పెన్ స్టైలస్ లభిస్తుంది. రగ్గ్డ్ బ్యాక్ కవర్, డేటా కేబుల్‌ను అందిస్తున్నారు.
ఈ ట్యాబ్‌కు వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. 5050 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. 5జి, ఎల్టీఈ, వైఫై 6, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3.5ఎంఎం ఆడియో జాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ వంటి అదనపు ఫీచర్లను సైతం ఇందులో అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫేస్ రికగ్నిషన్ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ ఉంది. గెలాక్సీ ట్యాబ్ యాక్టివ్ 5 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ట్యాబ్‌ను ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ ట్యాబ్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.49,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.56,999గా ఉంది.