Meta Layoffs | ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తుందన్న భయంతో అమెరికా కార్పొరేట్లు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ప్రత్యేకించి టెక్నాలజీ రంగ కంపెనీలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకు వెనుకాడటం లేదు. సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ మలి విడత ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. తాజాగా మరో 10 వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపుతామని మంగళవారం ప్రకటించింది. దాదాపు మరో 5000 మంది అదనపు ఓపెన్ రోల్స్ మూసేస్తామని తెలిపింది. గత నాలుగు నెలల్లో 11 వేల మంది సిబ్బందిని తొలగించింది. రెండో విడత కూడా భారీగా ఉద్యోగాల కోత విధిస్తామని ప్రకటించిన అతిపెద్ద టెక్ కంపెనీ మెటా కావడం గమనార్హం.
`ప్రస్తుత పరిస్థితుల్లో మా టీం సైజ్ తగ్గించాలని భావిస్తున్నాం. సుమారు 10 వేల మందిని తగ్గించుకోవాలని నిర్ణయించాం. మేం నియమించుకోని 5000 మంది అదనపు ఓపెన్ రోల్స్ ఉద్యోగాలు మూసేస్తాం` అని సిబ్బందికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పంపిన మెసేజ్‌లో పేర్కొన్నారు. ఖర్చులను 95 బిలియన్ డాలర్ల నుంచి 89 బిలియన్ డాలర్లకు కుదించాలన్న మార్క్ జుకర్‌బర్గ్ ఆలోచనకు అనుగుణంగానే ఉద్యోగులను మెటా తొలగిస్తున్నట్లు తెలుస్తున్నది. మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయంతో 2023 `ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ`గా నిలుస్తుందని చెబుతున్నారు.
అమెరికాలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఫలితంగా అమెరికా కార్పొరేట్ కంపెనీలు సామూహికంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వాల్‌స్ట్రీట్ బ్యాంకులుగా పేరొందిన గోల్డ్‌మాన్ సాచెస్, మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు మొదలు అమెజాన్ డాట్కాం, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు టెక్ పరిశ్రమలు 2.80 లక్షల మందికి పైగా ఉద్యోగులకు లే-ఆఫ్స్ ప్రకటించాయి. ఈ ఏడాదిలో ఉద్యోగాల తొలగింపు 40 శాతానికి చేరుతుందని లే-ఆఫ్స్ ట్రాకింగ్ వెబ్సైట్ పేర్కొంది. గత రెండు నెలల్లోనే అమెరికా కంపెనీలు 1.80 లక్షల మందికి పైగా ఉద్యోగులను సాగనంపాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నది.