మీ బ్యాంక్ అకౌంట్లో లక్షల రూపాయలు ఉన్నా.. సైబర్ నేరగాళ్లు తలుచుకుంటే వాళ్లు ఉన్నచోటే మీ ఖాతాను క్షణాల్లో జీరో చేయగలరు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని సరికొత్త ట్రిక్స్‌తో కస్టమర్లను బోల్తా కొట్టిస్తున్నారు. వాళ్ల అకౌంట్లను గుల్లా చేస్తున్నారు.
అందుకే.. సైబర్ నేరగాళ్లు ఎలా కస్టమర్లను బోల్తా కొట్టిస్తున్నారో.. ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించి బ్యాంక్ అకౌంట్లను టార్గెట్ చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని.. సైబర్ నేరగాళ్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది.
ఈమధ్య జరుగుతున్న ఎక్కువ ఫైనాన్సియల్ ఫ్రాడ్స్ వెనుక అసలు కారణం కస్టమర్లే అని.. తెలిసో తెలియకో కస్టమర్లు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన సెన్సిటివ్ డేటాను షేర్ చేయడమే సైబర్ నేరగాళ్లకు వరంలా మారింది.
హ్యాకర్స్ ఎక్కువగా కొన్ని రకాల హైఫై టెక్నిక్స్‌ను ఉపయోగించుకొని జనాలను టార్గెట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడుతున్నట్టు ఆర్బీఐ గుర్తించింది. అవేంటో తెలుసుకొని అలాంటి టెక్నిక్‌ను మీ మీద ప్రయోగిస్తే.. వెంటనే ఆ హ్యాకర్లకు చెక్ పెట్టండి.
ఆన్లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకొని హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. తాము నమ్మకమైన కొనుగోలుదారులుగా ప్రవర్తిస్తుంటారు. ఆన్లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండే ప్రొడక్ట్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. డిఫెన్స్‌లో పనిచేస్తామని.. లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులమని నమ్మిస్తారు. పోస్టింగ్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో అని చెబుతారు. నమ్మకం కలిగేలా చేసి డబ్బులు పంపిస్తామని చెప్పి ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యాప్స్ నుంచి డబ్బులు పంపించకుండా.. రిక్వెస్ట్ మనీ ఆప్షన్‌ను వాహనాన్ని అమ్మే వ్యక్తికి పంపిస్తారు. ఆ వ్యక్తి నిజంగా డబ్బలు పంపిస్తున్నారేమో అనుకొని యాక్సెప్ట్ బటన్ నొక్కి.. పిన్ ఎంటర్ చేస్తే చాలు.. డబ్బులు అమ్మే వ్యక్తికి కాదు.. కొనుగోలు చేస్తున్నట్టు నటించే వ్యక్తికే ట్రాన్స్ఫర్ అవుతాయి. దీన్నే ఆన్లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ఫ్రాడ్‌గా వ్యవహరిస్తారు.
ఎలాగైనా కస్టమర్లతో స్క్రీన్ షేరింగ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా ట్రిక్ ఉపయోగిస్తారు స్కామర్లు. లింక్ లేదా.. ఇతర అట్రాక్టివ్ మెసేజ్‌లు పంపించి స్క్రీన్ షేరింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా చేస్తారు. ఆ యాప్‌ను యూజర్లు తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాక.. దాన్ని రిమోట్‌గా యాక్సెస్ చేసుకుంటారు. కస్టమర్ ఫైనాన్సియల్ డేటా మొత్తాన్ని తస్కరించి.. సైబర్ నేరానికి పాల్పడుతారు.
చాలామంది ఏదైనా బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను ఆశ్రయిస్తుంటారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో షేక్ నెంబర్స్ పెట్టి కస్టమర్లను తమవైపునకు తిప్పుకుంటారు హ్యాకర్లు. ఆ ఫేక్ నెంబర్‌కు కాల్ చేయగానే.. కస్టమర్ నుంచి అన్ని రకాల సెన్సిటివ్ డేటాను లాగి.. సైబర్ నేరానికి ఒడిగడతారు.
చాలామంది సైబర్ క్రిమినల్స్ ఫేక్ క్యూఆర్ కోడ్‌ను క్రియేట్ చేసి.. కస్టమర్లకు ఫోన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేలా ఆశ చూపుతారు. కస్టమర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెంటనే వాళ్ల అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా కోడ్ సెట్ చేస్తారు నేరగాళ్లు. అందుకే.. ఫోన్ చేసి ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటే వెంటనే తొందరపడి చేస్తే బ్యాంక్‌లోని డబ్బంతా గుల్ల కావాల్సిందే.
జ్యూస్ జాకింగ్ ద్వారా సైబర్ క్రిమినల్స్ కస్టమర్లను టార్గెట్ చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. పబ్లిక్ ప్లేస్‌లో ఉండే పోర్టులను ఉపయోగించి చాలామంది తమ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే.. ఆ చార్జింగ్ పోర్టే.. డేటా ట్రాన్స్‌ఫర్‌కు వేదిక అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. పబ్లిక్ చార్జింగ్ పోర్ట్‌లో ఫోన్ చార్జింగ్ పెట్టగానే కస్టమర్ ఫోన్లోకి మాల్వేర్ను పంపిస్తారు. ఆ తర్వాత కస్టమర్ ఫోన్‌ను యాక్సెస్ చేసుకొని సెన్సిటివ్ డేటా మొత్తాన్ని తస్కరించి సైబర్ నేరానికి పాల్పడుతుంటారు.