Covid-19 | గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. శనివారం 13వేలకుపైగా కొత్త కేసులు నమోదవగా.. ఆదివారం కాస్త తగ్గాయి. అయినా, 12వేలకుపైగానే కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,899 మంది వైరస్ బారినపడ్డారు. కేసులు వేగంగా పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు అధ్యయనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. జనవరి – ఫిబ్రవరి మూడో వేవ్ తర్వాత దేశంలో రోజవారీ కేసులు భారీగా పెరగడం ఇదే మొదటిసారి.
దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజులో 1,797 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు నెలల తర్వాత అత్యధికంగా కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్రలో 1800 మంది వైరస్ బారినపడ్డారు. ఒమిక్రాన్‌తో పాటు సబ్ వేరియంట్లు సైతం దేశంలో నమోదవుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. టీకా తీసుకున్న అనంతరం శరీరంలో ఉత్పత్తయ్యే రోగ నిరోధక శక్తిని సైతం తప్పించుకోగలవని చెబుతున్నారు. ఈ క్రమంలో అందరూ తప్పనిసరిగా వైరస్ బారినపడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే వైరస్ ముప్పు పొంచి హెచ్చరిస్తున్నారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోగలవని పలు అధ్యయాల్లో తేలింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ వైరస్ ముప్పు పొంచి ఉండడంతో కరోనా ఇన్ఫెక్షన్ నుంచి ఎంత సురక్షితంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించి తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఓ స్పెషల్ టెస్ట్ గురించి ప్రకటించారు. నేచర్ బయోటెక్నాలజీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. కరోనా నుంచి సురక్షితంగా ఉన్నామా? లేదా ? అని తెలుసుకునేందుకు ఓ పరికరాన్ని అభివృద్ధి చేశారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రస్తుతం దీనిపై సమీక్షిస్తున్నది. యూకే ఆధారిత బయోటెక్నాలజీ కంపెనీ అయిన హైరిస్ ద్వారా లైసెన్స్ పొందింది. ఈ కిట్‌ను యూరప్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ఉపయోగిస్తున్నారు.
నివేదిక ప్రకారం.. ఈ కిట్‌లో పరీక్ష కోసం రక్త నమూనా సేకరిస్తున్నారు. ఇది టీ సెల్స్‌ను కొలుస్తుంది. ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమైన తెల్ల రక్త కణాలలో ఒకటైన లింఫోసైట్ రకం. ఈ పరీక్ష ఫలితాలు 24 గంటల్లో పొందవచ్చు. దీని ఆధారంగా వైరస్ నుంచి ఎంత సేఫ్‌గా ఉన్నారో ? అంచనా వేయవచ్చు. దీనిపై అధ్యయన సహ రచయిత ఎర్నెస్టో గుసియోన్ ప్రకారం.. టీకా వేసిన ఒక సంవత్సరం వరకు మాత్రమే టీ సెల్స్ పరీక్ష ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, ఈ కిట్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని గుర్తించడానికి ఓ ప్రభావవంతమైన మార్గమని సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ కిట్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేదానిపై వివరణ లేదు. ఎందుకంటే.. రోగనిరోధక శక్తిని పెంచే వేరియంట్లకు సంబంధించిన కేసులను సైతం నిపుణులు పరిశీలిస్తున్నారు.