24 Hours | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రోజుకు 24 గంటలు అని చిన్నప్పుడు స్కూల్లో చదువుకొన్నాం. అయితే, రానున్న రోజుల్లో రోజు అంటే 24 కంటే ఎక్కువ గంటలు ఉండే అవకాశమున్నదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. భూతాపం, వాతావరణ మార్పుల కారణంగా గ్రీన్లాండ్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ తదితర ధ్రువప్రాంతాల్లో పెద్దయెత్తున మంచు కరిగిపోతున్నది. ఇది ఇలాగే కొనసాగితే, సముద్రాల్లో నీటి మట్టాలు పెరిగిపోతాయి.
భూభాగం క్రమంగా తగ్గిపోతుంది. ఇది సముద్రాలపై పడే చంద్రుడి గురుత్వాకర్షణపై, భూ గురుత్వాకర్షణ శక్తిపై ప్రభావాన్ని చూపించి భూభ్రమణ వేగాన్ని నెమ్మదించేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే తొలుత 24 గంటలు ఉన్న రోజు వ్యవధి మిల్లీసెకండ్ల మేర పెరుగుతుందని, ఆ తర్వాత ఈ వ్యవధి మరింత పెరుగొచ్చని హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు.
రోజు వ్యవధి పెరుగడంతో మిల్లీసెకండ్ల కచ్చితత్వంతో పనిచేసే ఇంటర్నెట్ ట్రాఫిక్, ఆర్థిక లావాదేవీలు, నావిగేషన్, రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ ప్రసారాలు ఇలా సాంకేతికంగా అన్ని ప్రధాన రంగాలపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.