Britain Space mission | విమానం ద్వారా చేపట్టిన బ్రిటన్ తొలి అంతరిక్ష యాత్ర ప్రయోగం విఫలమైంది. ‘ది స్టార్ట్ మీ అప్’ పేరుతో బ్రిటన్‌కు చెందిన వర్జీన్ ఆర్బిట్ సంస్థ ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. సోమవారం రాత్రి అంతరిక్షంలోకి దూసుకుపోయిన విమానం.. రాకెట్‌ను విజయవంతంగా విడుదల చేసింది. అయితే, రాకెట్ మాత్రం శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది. రాకెట్ విడుదల తర్వాత సిబ్బందిని తీసుకుని విమానం క్షేమంగా భూమిపైకి దిగింది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విమానాశ్రయానికి తరలివచ్చారు.
విమానం ద్వారా తొలిసారి అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగాన్ని బ్రిటన్‌కు చెందిన వర్జిన్ ఆర్బిట్ చేపట్టింది. 747 బోయింగ్‌లో కొన్ని మార్పులు చేసి రాకెట్ మోసుకెళ్లే విధంగా రూపుదిద్దారు. ఈ విమానానికి కాస్మిక్ గర్ల్ అని పేరు పెట్టారు. అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్‌ను ఈ విమానం రెక్కల కింది భాగంలో అమర్చారు. రాకెట్‌ను 21 మీటర్ల పొడవుతో తయారుచేశారు. ఈ రాకెట్ ద్వారా 9 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం అర్ధరాత్రి నైరుతి ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ స్పేస్‌పోర్ట్ నుంచి అంతరిక్షంలోకి కాస్మిక్ గర్ల్ దూసుకుపోయింది.
విమానం 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత విజయవంతంగా రాకెట్‌ను విడుదల చేసింది. అనంతరం విమానం క్రూతో క్షేమంగా భూమిపైకి దిగింది. విమానం నుంచి రాకెట్‌ను ప్రయోగించేందుకు లాంచర్ వన్ అనే వాహనాన్ని ఉపయోగించారు. అనంతరం కక్ష్య వైపు రాకెట్ కదిలింది. అయితే అంతరిక్ష కక్ష్యలోకి శాటిలైట్లను తీసుకెళ్లడంలో రాకెట్ విఫలమైంది. కాగా, వర్జిన్ ఆర్బిట్ కంపెనీకిది రెండో ఫెయిల్యూర్. అయితే, ఈ సంస్థ ఇప్పటివరకు 4 మిషన్లను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ రాకెట్ ప్రయోగంలో మరో విశేషం ఏంటంటే.. అంతరిక్షంలోకి రాకెట్ నిలువునా దూసుకుపోకుండా.. విమానంలో కొంత దూరం తీసుకెళ్లి అక్కడి నుంచి లాంచర్ వెహికిల్ సాయంతో అంతరిక్షంలో పంపించారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన అమెరికా కూడా విఫలమైంది.