Liger X bike | నగర రోడ్లపై బైకులు నడపడం కాస్తా ఇబ్బందిగానే ఉంటుంది. మాటిమాటికి ఇతర వాహనాలు అడ్డుగా రావడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండటంతో ప్రతీసారి బైకును నిలిపి కాళ్లతో బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇక ట్రాఫిక్లోనైతే కాళ్లను భూమిపై రాసుకుంటూనే బైక్‌ను నడుపుతూ వెళ్లాల్సిన ఆగత్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో మన సమస్యలను దూరం చేసేందుకు ఆటో బ్యాలెన్సింగ్ బైకులు రాబోతున్నాయి. ఈ తరహా బైకు మన దేశంలో ఇదే మొదటిది. ఈ బైకును ప్రస్తుతం జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ బైకును చూసేందుకు, నడిపేందుకు ఎందరో ఉత్సాహం చూపడం విశేషం. హోండా కంపెనీ కూడా గత ఐదేండ్లుగా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ బైకులపై పరిశోధనలు చేస్తున్నది.
ఆటో బ్యాలెన్సింగ్ బైకుకు లైగర్ అని పేరు పెట్టారు. లైగర్ అంటే లయన్ + టైగర్ కలిస్తే పుట్టే బ్రీడ్ అని అర్ధం. దీనిలో కూడా అంతే పవర్ ఉంటుందని చెప్తున్నారు ఈ ఆటో బ్యాలెన్సింగ్ బైక్ సృష్టికర్తలు. ఈ బైక్ తయారుచేసింది మన దేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే కావడం మరో విశేషం. ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను పరిచయం చేయడంతో లైగర్ ఎక్స్ పేరు మార్మోగిపోతున్నది. లైగర్ మొబిలిటి సంస్థ ఈ ఆటోబ్యాలెన్సింగ్ బైక్ టెక్నాలజీకి పెటెంట్ పొందింది.
ఈ బైక్‌కు స్టాండ్ అక్కర్లేదు. కార్ల మాదిరిగానే పార్కింగ్ చేయొచ్చు. కారు మాదిరిగానే వెనక్కి నడిపించే వీలు కూడా దీని సొంతం. మరో విశేషం ఏంటంటే ఇది మన మాటల్ని విని చక్కగా ఫాలో అవుతుంది. లెర్నర్ మోడ్ అనే ప్రత్యేకతను కలిగి ఉండి.. ఇప్పుడిప్పుడే బైక్ నేర్చుకుంటున్నవారి కోసం వేగాన్ని నియంత్రించుకునే వెసులుబాటు దీనిలో ఉంటుంది.
ఈ ఆటో బ్యాలెన్సింగ్ బైకును మన ఐఐటీ విద్యార్థులు తయారుచేశారు. ఒకతను ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఆశుతోష్ ఉపాధ్యాయ్ కాగా, మరొకరు ఐఐటీ మద్రాస్ విద్యార్తి వికాస్ పోద్దార్. వీరిద్దరు కలిసి ఈ బైక్ తయారీపై విశేష పరిశోధనలు చేశారు. వికాస్ పోద్దార్ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకున్నారు. 2016 లో లైగర్ మొబిలిటి అనే సంస్థను స్థాపించిన వీరిద్దరూ రెండేండ్ల పాటు కఠోర శ్రమతో ఈ బైక్‌కు రూపకల్పన చేశారు.
బైకు ప్రమాదాల్లో రోజుకు 120 మంది చనిపోతున్న విషయంపై దృష్టిసారించిన ఈ యువకులు.. దానికి గల కారణాలను విశ్లేషించారు. గైడోస్కోపిక్ టెక్నాలజీని ఈ బైకుల తయారీలో వాడారు. వీల్స్ మధ్య ఉండే ఎలక్ట్రిక్ సెన్సార్లు వాహనం స్పీడ్‌తోపాటు యాంగిల్స్‌ను డిటెక్ట్ చేస్తూ మనల్ని అలర్ట్ చేస్తుంది. ఈ బైకులో ఉండే ఆర్టిఫిషిల్ టెక్నాలజీ మనకు ప్రమాదాలను ముందే పసిగట్టి తెలియజేస్తుంది.