న్యూఢిల్లీ : ఐఫోన్ సేల్స్ ఊపందుకోవడంతో భారత్‌లో గత ఆర్ధిక సంవత్సరంలో యాపిల్ తన వ్యాపారాన్ని రెట్టింపు చేసుకుంది. యాపిల్ గ్లోబల్ ఆపరేషన్స్‌లో భారత్ కీలక మార్కెట్‌గా ఎదుగుతోందని ఇది సంకేతాలు పంపుతోంది. 2021 ఆర్ధిక సంవత్సరంలో తమ రాబడిలో మూడింట ఓ వంతు ఎదుగుతున్న మార్కెట్ల నుంచే సమకూరిందని, భారత్, వియత్నాం దేశాల్లో తమ వ్యాపారం రెట్టింపైందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.
భవిష్యత్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగుతూ తమ నూతన ఉత్పత్తులకు మెరుగైన డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నానమని నాలుగో త్రైమాసిక ఫలితాల అనంతరం ఆయన తెలిపారు. భారత్ సహా ఆసియాలో ఈ క్వార్టర్లో యాపిల్ రాబడి 37 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. చైనా బ్రాండ్లు, శాంసంగ్ ఫోన్ల ప్రాబల్యం కలిగిన భారత్ మార్కెట్లో యాపిల్ రాబడి పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో భారత్ మార్కెట్ తమకు కీలకం కానుందని యాపిల్ భావిస్తోంది.