న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఏఐ సామర్ధ్యాలను చాటిచెప్పిన చాట్‌జీపీటీపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ న్యూ కాన్సెప్ట్ కాకపోయినా ఈ రంగాన్ని పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం ఇప్పటివరకూ జరగలేదు. చాట్‌జీపీటీ రంగప్రవేశంతో ఏఐ కొత్తపుంతలు తొక్కుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఏఐ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీపై తాజాగా యాపిల్ సహ వ్యవస్ధాపకులు స్టీవ్ వాజ్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీ అద్భుత ప్రక్రియ, ఇది మానవాళికి ఉపయోగకరమైనదేనని అన్నారు. అయితే మానవులు కోరుకునే దాన్ని చాట్‌బాట్ సరిగ్గా అవగతం చేసుకోనందున చాట్‌జీపీటీ ఘోర తప్పిదాలకూ పాల్పడుతుందని ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. చాట్‌జీపీటీ మనకు గొప్ప పనులు చక్కబెట్టినా అది భారీ మిస్టేక్స్కూ తావిస్తుందని పేర్కొన్నారు. సెల్ఫ్ డ్రైవ్ కార్లు, మనుషులు నడిపే కార్ల మధ్య వ్యత్యాసంతో ఏఐ టెక్నాలజీని ఆయన సరిపోల్చారు.
మానవ డ్రైవర్లను ఏఐ ఎన్నడూ రీప్లేస్ చేయలేదని, మనుషుల గురించి దానికి (ఏఐ) తెలియదని చెప్పుకొచ్చారు. ఇక మానవ జీవితాలను సుసంపన్నం చేయడంలో ఏఐ సామర్ధ్యాలు అద్భుతంగా పనిచేస్తాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కితాబిచ్చారు. యాపిల్‌లో తాము ఏఐపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని కుక్ తెలిపారు.
గత ఏడాది నవంబర్‌లో పరజల ముందుకొచ్చిన చాట్‌జీపీటీ యూజర్ల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. విద్యార్ధులు వ్యాసాలు రాసేందుకు ఈ ఏఐ చాట్‌బాట్‌ను వాడుతుంటే, వాద్యకారులు మ్యూజిక్‌ను కంపోజ్ చేసేందుకు, కంటెంట్ క్రియేటర్లు వీడియో ఐడియాల కోసం దీన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంజనీర్లు పర్ఫెక్ట్ కోడ్స్ కోసం ఇలా అన్ని వర్గాల వారు, ప్రొఫెషనల్స్ సైతం చాట్‌జీపీటీని వాడుతున్నారు.