న్యూయార్క్ : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పలు విభాగాల్లో నియామకాల ప్రక్రియను నిలిపివేసింది. ప్రతికూల ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ సహా పలు టెక్ దిగ్గజాలు ఉద్యోగుల తొలగింపు, హైరింగ్ నిలిపివేత వంటి పలు వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతున్నాయి.
అమెజాన్ సైతం హైరింగ్‌ను కొద్దినెలల పాటు నిలిపివేయాలని మూడో త్రైమాసిక నివేదికలో వెల్లడించడం టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌కు తెరలేపింది. అసాధారణ స్ధూల ఆర్ధిక వాతావరణంతో హైరింగ్ నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించిందని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీపుల్ బెత్ గలేటి స్పష్టం చేశారు. ఆర్ధిక వ్యవస్ధను దృష్టిలో ఉంచుకుని తమ హైరింగ్, ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల మధ్య సమతూకం పాటిస్తామని గలేటి పేర్కొన్నారు.
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు అవసరమైన మేర నియామకాలు చేపడతామని చెప్పారు. ప్రైమ్ వీడియో, అలెక్సా, గ్రాసరీ, జూక్స్, హెల్త్‌కేర్ వ్యాపారాల్లో పెట్టుబడులు కొనసాగుతాని స్పష్టం చేశారు. ఇక ప్రతికూల పరిస్ధితులు వెంటాడుతున్న క్రమంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంలో నియామక ప్రక్రియను నిలిపివేయనున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ప్రకటించారు.