Google Maps | హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ): గాలి నాణ్యతను తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వినియోగదారులు వివిధ ప్రదేశాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ను తెలుసుకోవచ్చు. గాలి నాణ్యతను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ను వారం రోజుల్లోగా 100కుపైగా దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగు ల్ ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్‌లో ఏక్యూఐ రీడింగ్‌లు అందరికీ సులభంగా అర్థమయ్యే ఫార్మాట్లో ఉంటాయని తెలిపింది. ఏక్యూఐ 0 నుంచి 50 లోపు ఉంటే ఆరోగ్యానికి మంచిది. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైన స్థాయిగా, 101-200 మధ్య ఉంటే మితమైన స్థాయి గా, 201-300 వరకు ఉంటే హానికర స్థాయిగా, 301-400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా, 401-500 వరకు ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు.
ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయాలంటే వినియోగదారులు తొలుత గూగుల్ మ్యాప్స్‌కి వెళ్లాలి. అనంతరం లేయర్స్ ఐకాన్‌పై క్లిక్ చేసి, ఎయిర్ క్వాలిటీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వినియోగదారులు ఏప్రాంతంలోనైనా గాలి నాణ్యతను తనిఖీ చేసుకోవచ్చు.