5G Spectrum | త్వరలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చేనెలాఖరు నాటికి 5జీ వేలం ప్రక్రియ నియమ నిబంధనలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సిఫారసులను టెలికం శాఖకు సమర్పించనున్నది. తదుపరి వేలం ప్రక్రియ పూర్తిచేయడానికి 30 రోజుల సమయం పడుతుందని కేంద్ర టెలికంశాఖ కార్యదర్శి కే రాజారామన్ ఓ వార్తా సంస్థకు చెప్పారు. ఇంతకుముందు స్పెక్ట్రం వేలంపై ట్రాయ్ సిఫారసులు సమర్పించిన తర్వాత వేలం బిడ్డింగ్ రౌండ్లు ప్రారంభించడానికి రెండు నెలల నుంచి నాలుగు నెలల సమయం పట్టేదన్నారు. మే నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
కానీ ట్రాయ్ నుంచి సిఫారసులు అందిన రోజు నుంచి వేలం బిడ్డింగ్ ప్రారంభానికి రెండు నెలల సమయం పడుతుందని టెలికం శాఖ కార్యదర్శి రాజరామన్ తెలిపారు. స్పెక్ట్రం ధర, దాని కేటాయింపు విధానం, స్పెక్ట్రం బ్లాక్ సైజు, చెల్లింపుల నిబంధనలు, షరతులు తదితర అంశాలపై సిఫారసులు చేయాలని ట్రాయ్ను టెలికం శాఖ కోరింది.
వివిధ భాగస్వాములు, వాటాదారులు, టెలికం పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాత టెలికం శాఖకు ట్రాయ్ సిఫారసులు సమర్పిస్తుంది. ఇప్పుడు అమలులో ఉన్న పద్దతి మేరకు స్పెక్ట్రం వేలంపై విధి విధానాలపై టెలికంశాఖ డిజిటల్ కమ్యూనికేషన్స్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపుతుంది. ఇదిలా ఉంటే 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియను ఇప్పటికే ఎంఎస్టీసీకి అప్పగించామని రాజరామన్ తెలిపారు.