ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో 100 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. బెంగళూరులో టెక్ సమ్మిట్2022కు ముఖ్య అతిథిగా హాజరైన సోమనాథ్ మాట్లాడుతూ.. ఇస్రోతో 100 స్టార్టప్‌లు రిజిష్టర్ అయ్యాయని, అవన్నీ అంతరిక్ష రంగానికి సంబంధించిన పరికరాల తయారీలో పాలు పంచుకుంటున్నాయని అన్నారు. వీటిలో దాదాపు 10 స్టార్టప్‌లు శాటిలైట్స్, రాకెట్ల తయారు చేస్తున్నాయని తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, స్మార్ట్ మానుఫాక్చరింగ్లో ఇస్రో కీలకమైన పాత్ర పోషిస్తోందని, స్పేస్ టెక్నాలజీలో ఇస్రో, నాసాతో కలిసి పనిచేస్తుందని సోమనాథ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పేస్ టెక్నాలజీ, రాకెట్ల తయారీలో ఇస్రోతో కలిసి పనచేసేందుకు ఆసక్తి చూపించిన పలు కంపెనీలతో ఒప్పంద ప్రతాలపై ఇస్రో ఛైర్మన్ సంతకాలు చేశారు. అంతేకాదు త్వరలోనే చంద్రయాన్ ౩ మిషన్‌ను చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇస్రో ప్రస్తుతం దృష్టి సారించిన కార్బన్ ఫైబర్ టెక్నాలజీ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ గురించి సోమనాథ్ ప్రస్తావించారు.
అంతరిక్ష రంగంలో కూడా స్టార్టప్‌లు రావడంతో స్పేస్ టూరిజం మీద చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని సోమనాథ్ అన్నారు. ఈ సదస్సులో భారత దేశంలో రీసెర్చ్, డెవలప్మెంట్.. ప్రపంచం మీద ప్రభావం చూపే ఆవిష్కరణల గురించి ప్రధానంగా చర్చ జరిగింది.