శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sangareddy - Oct 27, 2020 , 00:04:10

ఘనంగా దసరా పండుగ ఉత్సవాలు

ఘనంగా దసరా పండుగ ఉత్సవాలు

దసరా వేడుకల్లో పాల్గొన్న

ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్‌, మహిపాల్‌రెడ్డి

ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, నాయకులు

అందోల్‌ : దసరా పండుగ ఉత్సవాలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా నూతన వస్ర్తాలు ధరించి ఊరేగింపుగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకు (బంగారం)ను తెంపి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో అలాయ్‌..బలాయ్‌కి స్వస్తి పలికి నమస్కారాలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వేడుకలు నిర్వహించుకున్నారు. పోలీస్‌స్టేషన్లలో పోలీసులు ఆయుధ పూజ నిర్వహించగా, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వాహనాలకు పూజలు చేశారు. 

సొంత గ్రామంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌..

దసరా పండుగ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ సొంత గ్రామం పోతులబొగుడలో స్థానికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా అనవాయితీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం డప్పుచప్పుళ్లతో ర్యాలీగా వెళ్లి పురోహితులతో జమ్మి చెట్టుకు పూజలు చేసి పండుగ వేడుకలను ప్రారంభించారు. ప్రతిఒక్కరిని ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందోల్‌- జోగిపేట మున్సిపాలిటీలో చైర్మన్‌ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్‌ మల్లికార్జున్‌, డాకూర్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు మంజుశ్రీరెడ్డి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. 

రామచంద్రాపురంలో..

రామచంద్రాపురం : విజయదశమి వేడుకలను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిఒక్కరూ వాహనాలకు పూజలు  నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు జమ్మి చెట్టుకు పూజలు చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆర్సీపురం డివిజన్‌లోని రామచంద్రారెడ్డినగర్‌లో ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్‌ కారణంగా ఈసారి రావణ దహనకాండను నిర్వహించలేదు. ఎవరికి వారు ఇండ్లలోనే దసరా వేడుకలు సంతోషంగా నిర్వహించుకున్నారు. ఆర్సీపురం, భారతీనగర్‌ డివిజన్లలో కార్పొరేటర్లు అంజయ్య, సింధూఆదర్శ్‌రెడ్డి, తెల్లాపూర్‌ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు 

గుమ్మడిదల : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మండలంలోని గుమ్మడిదల, బొంతపల్లి, అన్నారం, వీరన్నగూడెం తదితర గ్రామాల టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరహరి, యువత అధ్యక్షుడు నరహరి, సర్పంచ్‌లు ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, మమతావేణు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు. 

అమీన్‌పూర్‌లో..

అమీన్‌పూర్‌ : అమీన్‌పూర్‌ మండలం, మున్సిపల్‌ పరిధిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అన్ని గ్రామాల్లోనూ ప్రజలు ఉత్సాహంగా దసరా వేడుకలు నిర్వహించుకున్నారు. 


సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి వేడుకలు ప్రారంభించారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నందారం నరసింహాగౌడ్‌, కౌన్సిలర్లు కృష్ణ, మహాదేవరెడ్డి, మల్లేశ్‌, బిజిలీ రాజు, కో-ఆప్షన్‌ సభ్యులు యూనుస్‌, రాములు, నాయకులు తదితరులు ఉన్నారు. 

బొల్లారంలో..

బొల్లారం : మున్సిపాలిటీ పరిధిలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొల్లారంలోని పాత హనుమాన్‌ దేవాలయం వద్ద దసరా ఉత్సవాలను గ్రామస్తులు కొవిడ్‌ పాటిస్తూ జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు దేవాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ కొలన్‌ రోజారాణి, టీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రారెడ్డి, బాల్‌రెడ్డి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

గుమ్మడిదలలో..

గుమ్మడిదల : దసరా వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతోపాటు బొంతపల్లి, అన్నారం, దోమడుగు, కానుకుంట, మంభాపూర్‌, నల్లవల్లి, కొత్తపల్లి, రాంరెడ్డిబావి, వీరారెడ్డిపల్లి, నాగిరెడ్డిగూడెం, వీరన్నగూడెం గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి జమ్మి చెట్టుకు పూజలు చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం రావణాసురిడి దిష్టిబొమ్మను కాల్చి సంబురాలు చేసుకున్నారు. వీరభద్రప్వామి ఆలయంలో చైర్మన్‌ గటాటి భద్రప్ప, వీరన్నగూడెం సర్పంచ్‌ మమతావేణు, జూనియర్‌ అసిస్టెంట్‌ సోమయ్య ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు చేశారు. వేడుకల్లో ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌, తిరుమలవాసు, శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు. 

పుల్కల్‌లో..

పుల్కల్‌ : మండలంలో దసరా ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. దసరా సందర్భంగా పాలపిట్టను చూసిన అనంతరం జమ్మి చెట్టుకు పూజలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం చౌటకూర్‌లో మాజీ ఎంపీపీ సుభాశ్‌రెడ్డి, ముదిమాణిక్యంలో ఎంపీపీ పట్లోళ్ల చైతన్యవిజయ్‌భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్‌ దుర్గారెడ్డి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. 

జిన్నారంలో..

జిన్నారం : మండల వ్యాప్తంగా విజయదశమి వేడుకలను ప్రజలంతా ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్త బట్టలు ధరించి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో అలాయ్‌.. బలాయ్‌ లేకుండా నమస్కారాలతో దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పలు గ్రామాల్లో రావణాసురుడి బొమ్మలను దహనం చేశారు. 

రాయికోడ్‌లో..

రాయికోడ్‌ : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం గ్రామాల్లోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ శివారులో ఉన్న జమ్మి చెట్టులకు ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు జమ్మి పెట్టుకొని పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

హత్నూరలో..

హత్నూర : విజయదశమి ఉత్సవాలు హత్నూర మండలంలో ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాహనాలకు పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామాల్లో జమ్మి చెట్లకు పూజలు చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

మునిపల్లిలో..

మునిపల్లి : మండల కేంద్రమైన మునిపల్లితోపాటు అన్ని గ్రామాల్లో గ్రామస్తులు దసరా పండుగను ఘనంగా నిర్వహించారు. అందరూ కొత్త బట్టలు ధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో డప్పుచప్పుళ్లతో గ్రామాల శివారులో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఒకరికొకరు జమ్మి పెట్టుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.