గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Jan 15, 2020 , 04:10:57

ఇక సమరమే...

 ఇక సమరమే...
  • - ముగిసిన ఉపసంహరణలు
  • - ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
  • - బరిలో 620 మంది అభ్యర్థులు
  • - 621 మంది అభ్యర్థులు ఉపసంహరణ
  • - 162 వార్డుల్లో 4 వార్డులు ఏకగ్రీవం
  • - కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌
  • - కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌
సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో ఉపసంహరణ గడువు ముగిసింది.  రెండు రోజులుగా పోటా పోటీగా నామినేషన్లు దఖాలు చేసిన పార్టీల వారీగా అభ్యర్థులను అధిష్టానం నాయకులు బుచ్చగించడంతో 621మంది తమ నామినేషన్లు మంగళవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 7 మున్సిపాలిటీల్లో 620 మంది రాజకీయ పార్టీల, స్వతంత్రులు పోటీల్లో నిలిచారు. జిల్లాలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 162 వార్డుల్లో 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. జహీరాబాద్‌ మున్సిపాలిటీకి కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఏకగ్రీవం అయిన వార్డులన్నీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకొని ఎన్నికల విజయఢంకా మోగించింది. నేటి నుంచి మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఉపందుకోనున్నది. పార్టీల వారీగా అభ్యర్థులనూ గెలిపించుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తనించానున్నాయి. ఏడు మున్సిపాలీటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 158, కాంగ్రెస్‌ అభ్యర్థులు 155, బీజేపీ అభ్యర్థులు 120, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం ఇతర పార్టీలు, స్వతంత్రులు 187 మంది బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.

నాలుగు వార్డులు ఏకగ్రీవం

జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 162 వార్డులకు గాను నాలుగు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. సోమవారం బొల్లారం మున్సిపాలిటీలోని 8వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొలన్‌ రోజారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మంగళవారం ఉపసంహరణ చివరి రోజున సదాశివపేట మున్సిపాలిటీలో 5వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రజీయా బేగం ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. బొల్లారం మున్సిపాల్‌ పరిధిలోని 6వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాండ్ల సుజాతమహేందర్‌రెడ్డి, 12వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అర్రు బాలమణి కగ్రీవంగా ఎన్నికైయ్యారు. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహంతో ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషిచేస్తున్నారు.

తెల్లాపూర్‌ మున్సిపల్‌ బరిలో 58 మంది

రామచంద్రాపురం: తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డులకు సంబంధించి 85 మంది అభ్యర్థులు 134 నామినేషన్లను దాఖలు చేశారు. అందులో 27 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం 58 మంది అభ్యర్థులు మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 17 మంది, కాంగ్రెస్‌ నుంచి 17, బీజేపీ నుంచి 10, ఎంఐఎం నుంచి 1, స్వతంత్రులు 13 మంది పోటీలో ఉన్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సంగారెడ్డి తెలిపారు.

అందోలు-జోగిపేటలో 82 మంది

అందోల్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ  పూర్తయ్యింది. ఈ నెల 8న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ఉపసంహరణ గడువు ముగిసింది. అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 115 మంది అభ్యర్థులు 182 నామినేషన్లు వేశారు. వీరిలో 33 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకోగా, 82 మంది పోటీలో ఉన్నారు. రాజకీయ పార్టీల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారిని  మూడు రోజులుగా బుజ్జగించి, ఒప్పించి కొందర్ని నామినేషన్లు ఉప సంహరింపజేశారు. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన వారు రెబల్‌గా కొందరు పోటీలో ఉన్నారు. పార్టీ బీ ఫారాలను అందుకున్న అభ్యర్థులు మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులకు బీ ఫారాలను అందజేశారు. పార్టీ బీ ఫారాలను కార్యాలయంలో అందించిన వారికి ఆయా పార్టీల గుర్తులను అభ్యర్థులకు కేటాయించగా, స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారికి గుర్తులకు కేటాయించారు.

ఖేడ్‌లో 52 నామినేషన్ల ఉపసంహరణ

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం 52 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా, దాఖలైన నామినేషన్లలో సోమవారం 12 నామినేషన్ల ఉపసంహరణతో మొత్తం 64 నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 57 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉంటే మంగళవారం 1వ వార్డుకు సంబంధించి 2, 2వ వార్డుకు 5, 3వ వార్డుకు 5, 4 వార్డుకు 2, 5వ వార్డుకు 4, 6వ వార్డుకు 3, 7వ వార్డుకు 3, 8వ వార్డుకు 2, 9వ వార్డుకు 2, 10వ వార్డుకు 4, 11వ వార్డుకు 4, 12వ వార్డుకు 3, 13వ వార్డుకు 3, 14వ వార్డుకు 7, 15వ వార్డుకు 3 నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు.

సదాశివపేటలో..

సదాశివపేట: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలు ముగిశాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం ఆఖరు రోజు కాగా 56 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో మొత్తం 26వార్డులకు 280 నామినేషన్లు దాఖలయ్యాయి.  మంగళవారం నాటికి మొత్తం 56 మంది వారి నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిటర్నింగ్‌ అధికార్లకు పత్రాలు సమర్పించారు. కాగా, బరిలో ఇంకా 100 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 26 వార్డులకు గాను ఐదో వార్డు ఏకగ్రీవం అయ్యింది. ఆ వార్డులో నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైంది. పార్టీల వారీగా టీఆర్‌ఎస్‌ 11, కాంగ్రెస్‌ 18, బీజేపీ 6, సీపీఎం 5, స్వతంత్రులు 16 మంది వారి నామినేషన్లు ఉపపంహరించుకున్నారు.

బరిలో 100 మంది

మిగిలిన 100మంది 25వార్డులకు బరిలో ఉండగా 5వ వార్డు అభ్యర్థి రజియా బేగం ఏకగ్రీవమయ్యారు. మొత్తం 26 వార్డులకు ఒక వార్డు ఏకగ్రీవం 25 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీల వారీగా టీఆర్‌ఎస్‌ 26వార్డుల్లో పోటీలో ఉండగా ఒక వార్డు ఏకగ్రీవం కాగా, 25 వార్డుల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ 25, బీజేపీ 19, స్వతంత్రులు 23, ఎంఐఎం 3, సీపీఐ 3, సీపీఎం 1, టీజేఎస్‌ 1 మొత్తం 100మంది బరిలో ఉన్నారు.logo