Ace Review | విజయ్ సేతుపతి, ఆరుముగ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఏస్. రుక్మిణీ వసంత్, దివ్యా పిళ్లై, యోగి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత బి.శివప్రసాద్ తెలుగులోకి తీసుకొచ్చారు. మే 23న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ ఏంటంటే..
జైలు నుంచి విడుదలైన బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) కొత్త జీవితం మొదలుపెట్టేందుకు మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానానందం (యోగి బాబు) అతనికి ఆశ్రయం కల్పిస్తాడు. కల్పన (దివ్యా పిళ్లై) నడిపే హోటల్లో చెఫ్‌గా కాశీ పనిలో చేరతాడు. ఈ క్రమంలో రుక్మిణి (రుక్మిణి వసంత్)తో ప్రేమలో పడతాడు. తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుంచి ఇంటిని విడిపించుకోవడానికి ఆమె డబ్బు కూడబెడుతున్న విషయం తెలుసుకుంటాడు. మరోవైపు తన యజమాని కల్పన కూడా హోటల్ లోన్ కట్టలేక ఇబ్బంది పడుతుంది. దీంతో వీరిద్దరి సమస్యలను తీర్చడానికి జ్ఞానానందంతో కలిసి బోల్డ్ కాశీ మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపించే ధర్మ(అవినాశ్) దగ్గర అప్పు తీసుకుంటారు. ఈ క్రమంలో వడ్డీ కట్టడం ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు.
ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కాశీ ఎలా బయటపడ్డాడు? బ్యాంకు దోపిడీతో సంబంధం ఏమిటి? ఈ నేరాలన్నిటి నుంచి తప్పించుకుని, తాను ప్రేమించిన రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడా? అసలు బోల్ట్ కాశీ గతం ఏమిటి? చివరికి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఏస్ మూవీ కోసం దర్శకుడు అరుముగ కుమార్ మంచి కథను రాసుకున్నాడు. ఆ కథను అంతే ఎంగేజింగ్‌గా ప్రజెంట్ చేశాడు. అయితే కథనం ఊహకు అందేలా సాగుతుండటంతో ఆడియన్స్‌కు బోర్ తెప్పిస్తుంది. అయితే విజయ్ సేతుపతి డార్క్ కామెడీ, యోగిబాబు టైమింగ్, రుక్మిణీ వసంత్ అందాలు ఆ లోపాల్ని కప్పిపుచ్చేస్తుంటాయి. సినిమాలో అసలు కథను మొదలుపెట్టడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. ఫస్టాఫ్ మొత్తం పరిచయాలతోనే సరిపోతుంది. విజయ్ సేతుపతి, యోగిబాబు ట్రాక్.. హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ వంటి సన్నివేశాలతో కూల్‌గా సాగుతుంది. విలన్ డెన్‌కు వెళ్లి అక్కడ పేకాట ఆడే సీన్ బాగుంటుంది. ఇంటర్వెల్‌కు అసలు కథ మొదలవుతుంది.
సెకండాఫ్ అంతా కూడా అక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. బ్యాంక్‌లో దొంగిలించిన సొమ్ముతో హీరో ఎలా బయటపడతాడు? అసలు ఈ నేరాల్లోంచి ఎలా తప్పించుకుంటాడు? అనే పాయింట్లతో సెకండాఫ్ మరింత ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో హీరో చేత డైరెక్టర్ ఆడించే ఆట, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
సాంకేతికంగా ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుంది. కెమెరామెన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి. శామ్ సీఎస్ ఆర్ఆర్ మెప్పిస్తుంది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది.
ఎవరెలా చేశారంటే..
బోల్ట్ కాశీగా విజయ్ సేతుపతి కొత్త పాత్రలో కనిపించాడు. మొదటి సారి డార్క్ కామెడీని పండించాడు. ఇక యోగి బాబు అయితే ఆద్యంతం నవ్విస్తాడు. రుక్మిణి వసంత్ అందాలు అందరినీ మెస్మరైజ్ చేస్తాయి. దివ్యా పిళ్లైకి ఓ మంచి పాత్ర దక్కింది. బబ్లూకి ఓ డిఫరెంట్ రోల్ పడింది. అవినాష్ విలనిజం మెప్పిస్తుంది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
రేటింగ్ : 2.75/5